తుక్కుగూడ ORRపై కారు బోల్తా: నలుగురికి తీవ్రగాయాలు
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించిన మరుసటి రోజే, శనివారం మధ్యాహ్నం తుక్కుగూడ సమీపంలోని ORR ఎగ్జిట్-14 వద్ద ఒక కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంద పోలీసులు తెలిపారు. నందిగామ నుండి శంషాబాద్‌లోని కన్హా శాంతి వనం వైపు కారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
సమాచారం అందిన వెంటనే, పహాడీ షరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను హుటాహుటిన ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ జామ్ అయింది. క్రేన్ సహాయంతో కారును తొలగించిన పోలీసులు, జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం పెద్ద గోల్కొండ సమీపంలోని ORRపై నిలిపి ఉంచిన ఒక లారీని కారు ఢీకొనడంతో, పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు.






