11 June, 2026 | 1:25 AM

ఈనెల 17న సీఎం రేవంత్ రెడ్డి

11-06-2026 12:23 AM

నల్లగొండ జిల్లాకు రాక 

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

తదుపరి భారీ బహిరంగ సభ

కనగల్‌లో సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

నల్లగొండ టౌన్, జూన్ 10 : ఈనెల 17న సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాకు రానునట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నల్గొండ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో సుమారు 13000 కోట్ల రూపాయలతో‘ హ్యం రోడ్లను‘ నిర్మించనున్నామని, ఇందులో 6300 కిలోమీటర్ల రోడ్లను డబుల్ రోడ్డు గా మార్చేందుకు టెండర్లు పిలవడం జరిగిందని, పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం ఈనెల 17న సాయంత్రం కనగల్ సమీపంలో హ్యాం రోడ్ల పనులకు శంకుస్థాపనచేయనున్నారని, ధర్వేశిపురం ఎల్లమ్మ దర్శనం చేసుకొనున్నారని తెలిపారు. పంచాయతీరాజ్ కి సంబంధించి మరో 7,000 కోట్ల రూపాయలతో నూతన రహదారులు నిర్మించనున్నట్లు చెప్పారు.

హ్యాం రోడ్ల లో భాగంగా మొదటి ప్యాకేజీ కింద సిఆర్‌ఎఫ్ ద్వారా 300 కోట్ల రూపాయలతో ధర్వేశిపురం నుండి గుర్రంపోడు, కొండమల్లేపల్లి నుండి డిండి వరకు డబుల్ రోడ్డు చేపట్టడం జరిగిందని, మొత్తం 1334 ప్యాకేజీలుగా విభజించామని, 13000 కోట్ల రూపాయల పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. శంకుస్థాపన అనంతరం తెలంగాణలోనే భారీ బహిరంగ సమావేశాన్ని కనగల్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. డబుల్ రోడ్ల నిర్మాణం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ,తద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు.

నల్గొండ తో పాటు, వలిగొండ ,ఆలేరు తదితర ప్రాంతాల కు కూడా 600 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించనున్నమని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో నిరంతరం త్రాగునీరు అందించేందుకు 125 కోట్ల రూపాయలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు ఈ వారంలో టెండర్లు పిలువనున్నామని ,నల్గొండ పట్టణాన్ని తెలంగాణలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు నల్గొండ కలెక్టరేట్ సమీపంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు తిప్పర్తి పరిశీలించి తగిన వసతులు కల్పించాలని కలెక్టర్ను ఆదేశించారు.