రూ.339.59 కోట్లతో భువనగిరిచిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన
ప్రజల చిరకాల కలను సాకారం చేసేందుకే రహదారి ఏర్పాటు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం
చిట్యాల, జూలై 12: దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న భువనగిరిచిట్యాల నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. రూ.339.59 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హమ్) విధానంలో భువనగిరి నుంచి చిట్యాల వరకు రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించే నిర్మాణ పనులకు రామన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టుకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభివృద్ధి దిశగా కీలక అడుగని పేర్కొన్నారు.
ఈ రహదారి పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు రహదారి భద్రత మెరుగుపడు తుందని, రవాణా సౌకర్యాలు విస్తరించి ప్రాంతీయ వాణిజ్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపు లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా అభి వృద్ధికి మరింత వేగం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమా ర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






