12 July, 2026 | 7:41 PM

వర్షాల కోసం కప్పతల్లి పూజలు

12-07-2026 06:46 PM

అడిగమా కే గ్రామంలో భాజా భజేంద్రులతో వరుణదేవునికి ప్రార్థనలు

ఇచ్చోడ,(విజయక్రాంతి): ఇచ్చోడ మండలంలోని అడిగమా కే గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామస్తులు ఆదివారం సంప్రదాయ పద్ధతిలో కప్పతల్లి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాజా భజేంద్రుల నాదాల మధ్య గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి వరుణదేవుని ప్రసన్నం చేసుకోవాలని ప్రార్థనలు చేశారు. వ్యవసాయ పనులు ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను అనుసరిస్తూ గ్రామ ప్రజలు కప్పతల్లి దేవతను పూజించి మంచి వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ... వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పతల్లి పూజలు నిర్వహించడం గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమని తెలిపారు. వరుణదేవుని అనుగ్రహంతో చెరువులు, కుంటలు నిండి రైతులకు మేలు జరగాలని ఆకాంక్షించారు.