13 July, 2026 | 2:14 AM

వ్యసనాల ఊబిలో కన్నపాశం బలి

13-07-2026 01:15 AM
  1. నిద్రలోనే భార్య, ఇద్దరు పసికందుల గొంతు కోసిన ఉన్మాది
  2. బెట్టింగ్ జూదం, అక్రమ సంబంధం తెచ్చిన ఘోరం.. 
  3. అప్పుల సుడిగుండంలో వరుస దారుణాలు

రంగారెడ్డి, జూలై 12 (విజయక్రాంతి): మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. బంధాలు, అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కాలయముడిగా మారగా, కల్మషం తెలియని పసిప్రాణాలు కన్నతండ్రి చేతిలోనే బలైపోయాయి. డబ్బుపై మోజు, జూదం, అక్రమ సంబంధాల వ్యామోహంలో పడి కొందరు ప్రాణాలు తీస్తుంటే.. మరి కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోయి నేరాల బాట పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలో వెలుగుచూసిన ఒక ఘోర కలియుగ ఉన్మాద ఘటనతో పాటు నగరంలో జరుగుతున్న వరుస దారుణాలు యావత్ సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి.

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.2.5 కోట్లు నష్టం..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్ కుమార్ అనే వ్యక్తి వ్యసనాల ఊబిలో మునిగిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్ ఆటకు అలవాటుపడి ఏకంగా రూ.2.5 కోట్లు పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా, ఒక మైనర్ బాలికతో నడిపిన వ్యవహారం కాస్తా ఇంట్లో తీవ్ర కలహాలకు దారితీసింది. భార్యతో నిత్యం గొడవలు జరుగు తుండేవి. ఈ క్రమంలోనే సదరు ఉన్మాదిలో మానవత్వం పూర్తిగా చచ్చిపోయింది. ఇంట్లో పెల్లుబికిన కోపంతో, కన్నపాశాన్ని సైతం మరిచిపోయాడు.

కళ్ళు తెరిస్తే లోకాన్ని చూసి మురిసిపోయే కన్నబిడ్డలు.. పరీక్షిత్ (4), దైవీక్షిత్ (2) అనే ఇద్దరు పసికందులతో పాటు భార్య నిద్రలో ఉండగా అత్యంత ఘోరంగా గొంతులు కోసి హతమార్చాడు. ఏ తప్పు ఎరుగని ఆ పసిపిల్లలను చంపడానికి చేతులెలా వచ్చాయంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్.. ‘హత్య’రాబాద్ అవుతోందా?

హైదరాబాద్.. బ్రాండ్ ఇమేజ్‌కు కేరాఫ్ అడ్రస్ కానీ, ఇప్పుడు సిటీ స్పీడు పెరిగేకొద్దీ మనుషుల్లో సహణం నశిస్తోంది. క్షణికావేశాల సుడిగుండంలో పడి పచ్చని సంసారాలు బూడిదవుతున్నాయి. నిన్న మొ న్నటివరకు ప్రేమతో వెలిగిపోయిన ఇళ్లు.. నేడు రక్తపు మడుగులుగా మారుతున్నాయి. వరుస హత్యలులు, ఆత్మహత్యలతో సిటీ జనాల గుండెల్లో వణుకు పుడుతోంది. తప్పు పెద్దలదైతే.. పసిపిల్ల లు అనాథలుగా మారుతున్న తీరు నగరాన్ని కన్నీరు పెట్టిస్తోంది.

జంట నగరాలను కుదిపేసిన ‘3’ దారుణాలు..

బాచుపల్లిలో మద్యం మత్తు: ‘రోజూ తాగి తందనాలాడితే ఇల్లు గడిచేదెలా?‘ అని ప్రశ్నించినందుకు, కట్టుకున్న భార్యను ఓ కిరాతకుడు దారుణంగా హతమార్చాడు. భార్య శ్మశానానికి.. భర్త జైలు పాలు కావడంతో పసిపిల్లలు దిక్కులేనివారయ్యారు.

చిలుకానగర్‌లో అనుమానం: భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, విచక్షణ కోల్పోయి ఆమెను నడిరోడ్డుపైనే ఘోరంగా నరికేసాడు.

ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో ఆర్థిక ఇబ్బందులు: అప్పుల బాధలు తట్టుకోలేక, రోజువారీ గొడవలతో మనస్తాపం చెంది ఒక దంపతులు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు.

కాపురాలను కూల్చుతున్న ఆ ‘నాలుగు’ మహమ్మారులు: ఆదాయానికి మించిన ఖర్చులు, క్రెడిట్ కార్డులు, అప్పుల భారం కాపురాల్లో రోజువారీ రణరంగానికి కారణమవుతున్నాయి.

సోషల్ మీడియా సైకోలు: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాడకం మితిమీరడంతో భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగి అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.

మద్యం వ్యసనం: నగరంలో జరుగుతున్న ఘోరాలలో 70శాతం నేరాలకు మద్యం మత్తే ప్రధాన కారణం 

సహనం లేని ‘సరికొత్త’ లైఫ్ స్టైల్: చిన్న విషయాలకే ఓపిక నశించి డిప్రెషన్, యాంగ్జైటీతో మనుషులు మృగాలుగా మారుతున్నారు.

పసిపిల్లల రోదన.. సమాజమా ఆలకించు..

ఒకవైపు సాంకేతికంగా సమాజం ఎంతో ముందుకు దూసుకుపోతున్నా, నైతికంగా మాత్రం పాతాళానికి పడిపోతోందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఈ క్రైమ్ లూప్లో నలిగిపోతున్నది ఎవరు? అమాయక చిన్నారులే.. కన్నవాళ్లు క్షణికావేశంలో తీసుకుంటున్న దారుణ నిర్ణయాల వల్ల పసిమొగ్గల భవిష్యత్తు శూన్యమవుతోంది. అటు శారీరకంగా, ఇటు మానసికంగా కుంగిపోతూ సమాజంలో ఒంటరైపోతున్నారు.

పరిష్కారం లేదా?

ప్రతి డివిజన్, గ్రామం పరిధిలో ఉచిత మానసిక, కు టుంబ కౌన్సిలింగ్ సెంటర్లు తక్షణమే ఏర్పాటు కావాలి. గృహ హింస ఎక్కువగా జరిగే ఇళ్లను ముందే గుర్తించి కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అవగాహన కల్పించాలి. ఒక నిమిషం ఆవేశాన్ని అణచుకుంటే.. జీవితాంతం పశ్చాత్తాపపడాల్సిన అవసరం రాదు. థింక్ సిటిజన్స్..