రియాద్ విమానాన్ని పేల్చేస్తాం
బెదిరింపుపై పోలీసులకు శంషాబాద్ ఏయిర్‌పోర్టు అధికారుల ఫిర్యాదు
శంషాబాద్, జూలై 12 (విజయక్రాంతి): రియాద్ విమానాన్ని గగనతలంలోనే పేల్చివేస్తామని శంషాబాద్ ఏయిర్‌పోర్ట్‌కు ఆదివారం బెదిరింపు ఈ మెయిల్ సందేశం రావడం కలకలం సృష్టించింది. ఏయిర్‌పోర్ట్ అధికారుల వివరాల ప్రకారం రియాద్ నుంచి ప్రయాణికులతో విమానం శంషాబాద్‌కు బయలుదేరింది. విమానంలో బాంబులు ఉన్నాయని, శంషాబాద్ ఏయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే పేల్చేస్తామని కస్టమర్ సపోర్ట్‌కు గుర్తు తెలియని వ్యక్తి ద్వారా సందేశం వచ్చింది.
దీంతో విమానాశ్రయ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. విమానం శంషాబాద్‌లో ల్యాండ్ కాగానే భద్రతాధికారులు తనిఖీలు చేపట్టారు. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏయిర్‌పోర్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






