18-02-2026 12:08:48 AM
అడుగడుగునా పోలీసుల బందోబస్తు
తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి అరెస్టు
జనగామలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పళ్లాను అడ్డుకున్న పోలీసులు
మహబూబాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): జనగామ, తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వందలాది మంది పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతరులెవ్వరిని ఆయా మున్సిపాలిటీల్లోకి అడుగుపెట్టకుండా స్వయంగా మహ బూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరీష్, వరంగల్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికిపైగా పోలీసులు తొర్రూరు, జనగామ పట్టణాలను అష్టదిగ్బంధనం చేశారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో బస్సులో క్యాంపు నుంచి తొర్రూరుకు వ స్తుండగా మడిపల్లి వద్ద ఆయనను పట్టణంలోకి రాకుండా నిలిపివేశారు. దీంతో దయాకర్‌రావు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని నరసింహులపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తొర్రూరు మున్సిపాలిటీ వద్ద ప్రత్యేకంగా భారీకేడ్లు ఏర్పాటుచేసి ఒక్కరు కూడా బయటకు రాకుండా కట్టడి చేశారు. ఉదయాన్నే తొర్రూరులో వందలాది పోలీసులు కవాతు నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక పూర్తయ్యేంతవరకు గట్టి బందోబస్తు నిర్వహించారు.
జనగామలో
జనగామలో సైతం బీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో బస్సులో వస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్‌రెడ్డిని అడ్డుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డిని జనగామలోకి ప్రవేశించకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కౌన్సిలర్లను మున్సిపాలిటీ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. ఇక్కడ కూడా వెయ్యి మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.
అలాగే రెండు మున్సి పాలిటీల్లో ఎన్నికలను పర్యవేక్షించడానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించిన మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవితను తొర్రూర్‌కు రాకుం డా పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తున్నామని చెప్పినా ఈ మా ర్గంలో వెళ్లడానికి వీల్లేదు అంటూ పోలీసులు అడ్డు చెప్పారని మాజీ ఎంపీ కవిత ఆరోపించారు.