మీ భూముల్లో మీరే ధైర్యంగా సాగు చేసుకోండి
దమ్మపేట సర్వే నెం.273 రైతుల భూముల్లోకి ఎవరికీ వచ్చే హక్కు లేదు
నాడు నా చేతుల మీదుగానే పేదలకు పంపిణీ చేసిన భూములివి
రైతులకు పూర్తి భరోసా ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని రైతులకు సూచన
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని నల్లకుంట సర్వే నెం.273 అసైన్డ్ భూముల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న నిరుపేద రైతులు సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ భూములను కొందరు కబ్జాదారులు లాక్కోవాలని చూస్తున్నారని, నకిలీ పత్రాలతో తమను ఇబ్బంది పెడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల గోడు విన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించి వారికి పూర్తి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఆనాడు పేద రైతులైన వారికి తన చేతుల మీదుగానే ఆ భూములను పంపిణీ చేయడం జరిగిందనీ, దశాబ్దాలుగా సాగులో ఉన్న ఆ భూములపై పూర్తి హక్కు పేద రైతులదేననీ, రైతుల భూముల్లోకి, వేరే వాళ్ళు రావడానికి ఎలాంటి హక్కు లేదని, కబ్జాదారుల బెదిరింపులకు మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, ఎప్పటిలాగే మీ భూముల్లో మీరే ధైర్యంగా వ్యవసాయం చేసుకోండి అని రైతులకు స్పష్టం చేశారు.
అలాగే, ఈ భూవివాదానికి సంబంధించిన విషయాలను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ తో తాను కూడా మాట్లాడతానని స్పష్టం చేశారు, రాష్ట్ర మంత్రి స్వయంగా తమకు అండగా నిలబడి, ధైర్యంగా సాగు చేసుకోమని చెప్పడంతో దమ్మపేట సర్వే నెం.273 బాధిత రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మంత్రి తుమ్మలను కలిసిన వారిలో మాజీ జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, కొయ్యల అచ్యుతరావు, రావు గంగాధరరావు, కాసాని నాగప్రసాద్, తదితరులు వున్నారు.






