ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
- మరో రూ.2 వేల కోట్ల బకాయిల విడుదల
- సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలతో విడుదల చేసిన ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం రూ.2 వేల కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను 100 రోజుల్లో రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, గత నెల 29న మొదటి విడతగా రూ.2 వేల కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం.. సోమవారం రెండో విడతలో మరో రూ.2 వేల కోట్ల నిధులను విడుదల చేసింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.
అందులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) బకాయిలను వంద శాతం చెల్లించి, వారి ఖాతాలను పూర్తిగా క్లియర్ చేసింది. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో ఎలాంటి పెండింగ్‌లు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది.
పెండింగ్‌లో ఉన్న రూ. 10 వేల లోపు విలువ కలిగిన చిన్న మొత్తాల బిల్లులన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించింది. ఈ విభాగంలో దాదాపు 5 లక్షలకు పైగా ఉన్న టోకెన్లను గుర్తించి, ఏమాత్రం జాప్యం లేకుండా చెల్లింపులు జరిపారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చూపుతున్న సానుకూల ధోరణి అభినందనీయమని వారు కొనియాడుతున్నారు






