కేయూ మాజీ వీసీ కన్నుమూత
హనుమకొండ/కాకతీయ యూనివర్సిటీ, మా ర్చి 14 (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ఎన్ లింగమూర్తి శనివారం మధ్యాహ్నం హనుమకొండలో కన్నుమూశారు. ఆయనకు భార్య అంజలి, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఆచార్య ఎన్ లింగమూర్తి 1981లో సీకేఎం కళాశాలలో ఎకనామిక్స్ అధ్యాపకుడిగా చేరారు. పలు హోదాల్లో పదోన్నతులు పొంది, కాకతీయ విశ్వ విద్యాలయంలో 2007 నుంచి 2010 వరకు ఉపకులపతిగా బాధ్యతలు నిర్వర్తించి, 2013లో పదవీ విరమణ పొందారు.
ఆయన వీసీగా పనిచేసిన సమయంలో కాకతీయ యూనివర్సిటీ అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాల స్థాపనకు కృషి చేశారు. గత ఆరు మాసాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు నెలలుగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం క్షీణించడంతో వారం రోజుల క్రితం హనుమకొండ లోని బ్యాంక్ కాలనీలోనీ ఆయన నివాసానికి తీసుకురాగా శనివారం తుది శ్వాస విడిచారు.




