calender_icon.png 6 January, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్‌పీఐ యాక్టివిటీ గ్లోబల్ ట్రెండ్‌పై దృష్టి

30-12-2024 01:16:11 AM

ఈ వారం మార్కెట్ కదలికలపై విశ్లేషకుల అంచనాలు

ముంబై,  డిసెంబర్ 29: కొత్త క్యాలండర్ సంవత్సరం ప్రారంభంకానున్న ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ కదలికల్ని గ్లోబల్ ట్రెండ్ నిర్దేశిస్తుందని విశ్లేషకులు తెలిపారు. అలాగే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) ట్రేడింగ్ యాక్టివిటీపై మార్కెట్ దృష్టి నిలిచి వున్నదన్నారు.

ఈ వారంలో మార్కెట్‌ను కదల్చగల ట్రిగ్గర్లు ఏవీ లేనందున, మార్కెట్ కదలికల్ని గ్లోబల్ ట్రెండ్స్ ప్రభావితం చేస్తాయన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరపడంతో భారత మార్కెట్‌పై ఒత్తిడి ఏర్పడుతున్నదని, కొత్త ఏడాదిలో వారి వైఖరి ఆధారంగా సమీప భవిష్యత్‌లో ట్రెండ్ ఉంటుందని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. 

డాలర్ మారకపు రేటు, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు కూడా మార్కెట్ దిశను నిర్దేశించే అంశాలేనని పేర్కొన్నారు. అలాగే క్యూ3 ఫలితాల సీజన్ సమీపిస్తున్నందున కార్పొరేట్లు వెల్లడించే అప్‌డేట్స్ మార్కెట్ ట్రెండ్‌పై ప్రభావం చూపుతాయని సంతోష్ మీనా వివరించారు.

గత శుక్రవారం రెండేండ్లలో ఎన్నడూ లేని భారీ పతనాన్ని చవిచూసిన రూపాయి విలువను కూడా ఇన్వెస్టర్లు ట్రాక్ చేస్తున్నారని, కరెన్సీ కదలికలు వారి పెట్టుబడి నిర్ణయాల్ని ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. డిసెంబర్ 27తో ముగిసి నవారం మొత్తంమీద సెన్సెక్స్ 657 పాయిం ట్లు, నిఫ్టీ 226 పాయింట్ల చొప్పున పెరిగాయి.  సెన్సెక్స్ 78,699 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,813 పాయింట్ల వద్ద ముగిసాయి. 

పరిమిత శ్రేణిలో ట్రేడింగ్

 సమీప భవిష్యత్తులో తగిన ట్రిగ్గర్లు ఏవీ లేనందున మార్కెట్ పరిమితశ్రేణిలో ట్రేడ్‌కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖెమ్కా అంచనా వేశారు. విదేశీ ఇన్వెస్టర్ల వ్యూహం కొనుగోళ్ల నుంచి విక్రయాలవైపునకు హఠాత్తుగా మారడం స్టాక్స్‌ను ప్రభావితం చేస్తున్న   

దని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు.  ఈ వారంలో ప్రధాన ఈవెంట్స్ లేనప్పటికీ,  యూఎస్ బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ కదలికలు, యూఎస్ జాబ్‌లెస్ క్లెయింల డేటా వంటివి మార్కెట్ ట్రెండ్‌ను కొంతమేర ప్రభావితం వివరించారు.

వచ్చే కొద్ది రోజుల్లో మార్కెట్ దృష్టి క్యూ3 కార్పొరేట్ ఫలితాలపైకి మళ్లుతుందని, ఆ ఫలితా లు స్టాక్ సూచీల మధ్యకాలిక ట్రెండ్‌కు కీలకంగా ఉంటాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. బడ్జెట్‌పై అంచనాలకు అనుగుణంగా ఇన్వెస్టర్లు వారి పోర్ట్‌ఫోలియోలను మార్చుకోనున్నందున, సూచీ లు ఒడిదుడుకులకు లోనుకావచ్చని అంచనా వేశారు.

పెరిగిన ఎఫ్‌పీఐ విక్రయాలు 

దేశీయ స్టాక్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాల జోరు పెరిగింది. డిసెంబర్ 27 ముగిసిన నాలుగు రోజుల ట్రేడింగ్ వారంలో ఎఫ్‌పీఐలు భారీగా రూ.6,322 కోట్ల విలువైన స్టాక్స్‌ను నికరంగా విక్రయించినట్లు డిపాజిటరీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అంత క్రితం వారంలో  ఎఫ్‌పీఐలు రూ.976 కోట్లు వెనక్కు తీసుకున్నారు.  వరుస రెండు నెలల భారీ విక్రయాల అనంతరం డిసెంబర్ నెల తొలి రెండు వారాలో  దేశీయ స్టాక్స్‌లో నికరంగా రూ.22,766 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు మూడోవారం నుంచి అమ్మకాలు ప్రారంభించారు.

రానున్న రోజుల్లో భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ అమలుపర్చే విధానాలు, ద్రవ్యోల్బణం ట్రెండ్, కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల సరళిపై ఆధారపడి ఉంటాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.  

ఆటో సేల్స్‌పై ఫోకస్

ఈ వారంలో వెలువడనున్న స్థూల ఆర్థిక గణాంకాలు, డిసెంబర్ నెల ఆటోమొబైల్ అమ్మకాల డేటా మార్కెట్‌ను కొంతమేర ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు తెలిపారు. ఆటోమొబైల్స్ నెలవా రీ అమ్మకాల డేటా విడుదల కారణంగా ఈ వారం మార్కెట్లో ఆటో స్టాక్స్ వెలుగులో ఉంటాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.

కొత్త క్యాలండర్ సంవత్సరం, కొత్త నెలలో అడుగుపెట్టే తరుణంలో వెలువడే ఆటో సేల్స్ డేటాను ట్రేడర్లు జాగ్రత్తగా గమనిస్తారని, అందుకు అనుగుణంగా పొజిషన్లు తీసుకుంటారని మిశ్రా వివరించారు. ఈ వారంలో యూ ఎస్, చైనాల తయా రీ పీఎంఐ డేటా వెలువడుతుందని, వారం చివర్లో వెల్లడయ్యే యూఎస్ జాబ్‌లెస్ క్లెయింలు అంతర్జాతీయ మార్కెట్లకు కీలకమని తెలిపారు.