19 August, 2026 | 11:05 PM

మొక్కలు నాటి.. భవిష్యత్ తరాలకు పచ్చని భద్రాచలం అందిద్దాం

19-08-2026 09:49 PM

ఐటీడీఏ పీఓ రాహుల్‌

భద్రాచలం,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పచ్చని భద్రాచలాన్ని అందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్‌ ఐఏఎస్ అన్నారు. బుధవారం భద్రాచలం పాత మార్కెట్ సెంటర్‌లోని భద్రాద్రి గిరిజన మార్ట్ ప్రాంగణంలో గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పీఓ రాహుల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని పీఓ సూచించారు. కేవలం మొక్కలు నాటడంతో కార్యక్రమం పూర్తికాదని, నాటిన మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా నిరంతరం సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

“ఒక్క మొక్క నాటి.. భవిష్యత్తును కాపాడుదాం” అనే సందేశంతో గ్రీన్ భద్రాద్రి చేపడుతున్న హరిత కార్యక్రమాలను ఆయన అభినందించారు. భద్రాచలం పట్టణాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వృక్ష ప్రేమికులు, యువత సమష్టిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, సెక్రటరీ భూక్యా రంజిత్ నాయక్, ట్రెజరర్ ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి,  గొల్ల భూపతిరావు, గ్రీన్ భద్రాద్రి వ్యవస్థాపక సభ్యులు జి. రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.