19 August, 2026 | 11:18 PM

యువత చేతుల్లోనే భవిష్యత్...

19-08-2026 09:46 PM

- ఉద్యోగమే లక్ష్యం కావాలి

- మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ

మందమర్రి, (విజయక్రాంతి): యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పోటీ పరీక్షల్లో విజయవంతంగా నిలబెట్టడం తమ ప్రధాన లక్ష్యమని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితులు ప్రతిభకు అడ్డంకి కాకూడదనీ, ప్రతి పేద విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగం సాధించే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మందమర్రిలో ' కాకా ఫ్రీ కోచింగ్' సెంటర్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల యువతకు ఖరీదైన కోచింగ్ భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల ఉన్న ప్రతి యువతికి ఈ కేంద్రం ఒక బలమైన వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అందుబాటులో ఉన్న శిక్షణను పూర్తిస్థాయిలో వినియోగించుకుని పట్టుదలతో చదవాలని సూచించారు.

అవకాశం మీ ముందుకు వచ్చింది.. ఇక విజయాన్ని మీ కష్టంతో సాధించాలని యువతకు మంత్రి దిశానిర్దేశం చేశారు. మందమర్రి నుంచి అత్యధిక సంఖ్యలో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఎంపికై రాష్ట్రస్థాయిలో ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నైపుణ్యాభివృద్ధి, ప్రత్యేక శిక్షణ, ఉద్యోగ అవకాశాల అనుసంధానం ద్వారా యువత భవిష్యత్తుకు బలమైన మార్గం చూపుతున్నామని తెలిపారు.

 కేసులు కాదు.. కెరీర్ కావాలి: ఎంపీ వంశీకృష్ణ

తెలంగాణ సాధనలో 'నీళ్లు, నిధులు, నియామకాలు' ప్రధాన ఆకాంక్షలని, యువతకు నియామకాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యతల్లో ఒకటని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉండి, వారి కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. యువతకు కేసులు కావాలా? ఉద్యోగాలు కావాలా? మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు సాధించడం కూడా యువతకు మంచి అవకాశమేనని అన్నారు.

కేటీఆర్ ఒక్కరే అమెరికా వెళ్లాలా..? తెలంగాణ యువత విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు సాధించకూడదా..? అని ప్రశ్నించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో TOMCOM ద్వారా తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ శాఖలు, కాకా ఫౌండేషన్ అందిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని తమ జీవితాలను మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

మందమర్రి నుంచి ఉద్యోగ విజయాల పరంపర రావాలి

ఒక కోచింగ్ సెంటర్ ప్రారంభం కావడం మాత్రమే కాదు, ఇక్కడి నుంచి వందలాది మంది యువత ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే లక్ష్యం అని వారన్నారు. కలలు కనడమే కాదు.. లక్ష్యాన్ని పెట్టుకోవాలనీ, లక్ష్యాన్ని పెట్టుకోవడమే కాదు.. కష్టపడాలనీ, కష్టపడడమే కాదు.. విజయం సాధించాలన్నారు. మందమర్రి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ విజయాల పరంపర సృష్టించాలని మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ పిలుపునిచ్చారు.