19 August, 2026 | 10:32 PM

పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలి!!

19-08-2026 09:35 PM

- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ.మహేందర్ రెడ్డి

శివంపేట్,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. అలాగే రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎంపిడిఓ కార్యాలయం ఎదుట  సీఐటీయూ  ఆధ్వర్యంలో 2వ రోజులో భాగంగా దీక్షను నిర్వహించడం జరిగిందని అనంతరం ఎంపిడిఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, రెండో పిఆర్సీలోకి తీసుకుని కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.

జీఓ నం.51ను సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, కార్టర్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు సకాలంలో చెల్లించాలని, వయసు సడలింపు, ఆరోగ్యకార్డులు గుర్తింపు, మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో సమోదు కాని కార్మికులను వెంటనే సమోదు చేయాలని కోరారు. మరణించిన పంచాయతీ కార్మికుల దహన సంస్కారాలకు రూ.30 వేల ఆర్థిక సాయం అందించాలని, కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.