calender_icon.png 4 January, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలి

30-12-2024 01:12:34 AM

* కేంద్ర బడ్జెట్‌కు సీఐఐ సూచనలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: అధిక ద్రవ్యోల్బణానికి కారణమవుతున్న పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్  సుంకాన్ని తగ్గించాలని పరిశ్రమల సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2025 బడ్జెట్‌కు పలు సూచనలు చేసిన సీఐఐ సుంకం తగ్గింపుతో దేశంలో అల్పాదాయ వర్గాల వినియోగం పెరుగుతుందని పేర్కొంది. 

ద్రవ్యోల్బణం అల్ప, మధ్యాదాయ వర్గాల కొనుగోలు శక్తిని తగ్గిస్తున్నదన్నది. పెట్రోల్ రిటైల్ ధరలో దాదాపు 21 శాతం, డీజిల్ రిటైల్ ధరలో 18 శాతం వరకూ కేవలం కేంద్ర ఎక్సైజ్ సుంకమే ఉన్నదని సీఐఐ తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల తగ్గుదలకు అనుగుణంగా 2022 మే నుంచి ఈ ఎక్సైజ్  సుంకాల్ని తగ్గించలేదని ఆరోపించింది. ఇంధనాలపై ఎక్సైజ్‌సుంకం తగ్గిం పుతో ద్రవ్యోల్బణం దిగివచ్చి, ప్రజలకు ఖర్చుచేసుకునే ఆదాయం పెరుగుతుందని పరిశ్రమల సమాఖ్య వివరించింది. 

భారత్ వృద్ధిబాటకు దేశీయ వినియోగం కీలకమని, కానీ ద్రవ్యోల్బణం ఒత్తిడి వినియోగదారుల కొనుగోలు శక్తిని హరించివేస్తున్నదని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. ప్రజల మిగులు ఆదాయాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని, దానితో వినియోగ వ్యయం పెరిగి జీడీపీ వృద్ధి జోరందుకుంటుందని తెలిపారు. 

రూ.20 లక్షల ఆదాయంవరకూ పన్ను రేట్లు తగ్గించాలి

రూ.20 లక్షల వార్షిక ఆదాయం వరకూ పన్ను రేట్లను తగ్గించాలని కోరింది. దీనితో వి నియోగం పుంజుకుని అధిక ఆర్థికాభివృద్ధి సా ధ్య పడుతుందని, పన్నుల ఆదాయం పెరుగుతుందని పేర్కొంది. అదాయపు పన్ను వ్యత్యా సా లను వివరిస్తూ కార్పొరేట్ ఇన్‌కం ట్యాక్స్ రేటు 25.17 శాతం ఉండగా, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులపై గరిష్ఠంగా 42.74 శాతం ఉ న్నదని, ఇది చాలా ఎక్కువని తెలిపింది. 

గ్రామీణ పథకాలపై లబ్ధి పెంచాలి

గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచడానికి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్, పీఎం కిసాన్, పీఎంఏవై తదితర కీలక పథకాల కింద అందించే ప్రయోజనాలను పెంచాలని సీఐఐ విన్నవించినట్లు బెనర్జీ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుకు అల్పాదాయ కుటుంబాలకు వినియోగ ఓచర్లు పంపిణీ చేయాలని సూచించామన్నారు.

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ (గ్రామీణ ఉపాధి హామీ పథకం) కింద ఒక్కొక్కరికి ఇస్తున్న మొత్తాన్ని రూ.267  నుంచి రూ.375కు పెంచాలని, పీఎం కిసాన్‌పై చెల్లిస్తున్న వార్షిక మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ. 8,000కు పెంచాలని సీఐఐ బడ్జెట్ మెమోరాండంలో విన్నవించింది.

పీఎంఏవైజీ, పీఎంఏవైయూ స్కీమ్‌లలపై యూనిట్‌కు ఇస్తున్న మొత్తాన్ని పెంచాలని కోరింది. నిర్దేశిత సమయంలో (6 లేదా 8 నెలలు) ఎంపికచేసిన ఉత్పత్తులు, సర్వీసుల్ని కొనుగోలు చేసేందుకు అల్పాదాయ వర్గాలకు ఓచర్లను ఇవ్వాలని సూచించింది. ఇతర సంక్షేమ పథకాలు అందుకోని జన్‌ధన్ ఖాతాదారులకు ఈ ప్రయోజనం కల్పించవచ్చని సిఫార్సుచేసింది.