హత్యాయత్నం కేసులో ఐదుగురిని అరెస్ట్
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం నెహ్రూ బస్తి రైలు పట్టాల సమీపంలో ఈ నెల 4వ తేదీన నరేష్ కోరి (40) సంవత్సరాలు అను వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. నిందితులను శనివారం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను వన్టౌన్ సిఐ కరుణాకర్ వెల్లడించారు. రైలు పట్టాల వద్ద ఉన్న కిరాణా దుకాణం వద్ద స్నేహితుడితో కలిసి మాట్లాడుతున్న, నరేష్ పై నాతరి శ్రీనాథ్, లోకేష్, శివ సంజయ్, వసుకుల ఉదయ్, నాతరి రాజేశ్వరరావు, ఐలయ్య లు రోకలి బండతో నరేష్ తలపై గట్టిగా కొట్టడంతో, అతను తీవ్రంగా గాయపడ్డాడు.
తలకు పలుచోట్ల గాయాలు కావడంతో స్పృహ కోల్పోయి, ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. వైద్యం నిమిత్తం ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి నరేష్ ను తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నరేష్ పరిస్థితి విషమంగా మారింది. నెహ్రూ బస్తీ ఏరియాలో నిర్మల అనే మహిళకు చెందిన రెండు అంతస్తుల భవనాన్ని, ఐలయ్య కొన్ని నెలల క్రితం ఆక్రమించాడు.
అతని వద్ద నిర్మల రూ 4 లక్షల అప్పుగా తీసుకుంది. ఆమెకు అనారోగ్యం కారణంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లడంతో అప్పు డబ్బులు ఇవ్వకపోవడంతో గత 18 నెలల నుండి, ఆ ఇంట్లో ఐలయ్య కుటుంబంతో ఉంటున్నాడు. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పినా, ఇల్లు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టాడు. ఈ విషయంలో నిర్మలకు నరేష్ సపోర్ట్ చేశాడని కక్ష పెంచుకొని ఉద్దేశపూర్వకంగా, నరేష్ పై దాడి చేసిన ఐదుగురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసికి రిమాండ్ కు తరలించారు.




