బీఆర్‌ఎస్.. బోగస్ రాష్ట్ర సమితి
వ్యక్తిగత ఆరోపణలకే ప్రతిపక్ష నేతలు పరిమితం
మా ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్
హైదరాబాద్, జూన్ 30(విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌పై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నాంపల్లి గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అంటే ‘బోగస్ రాష్ట్ర సమితి’ అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. మామ చాటు అల్లుడిగా హరీశ్‌రావు వ్యవహరిస్తున్నారని, మామ రాజకీయ పతనాన్ని కోరుకునే అల్లుడిగా ఆయన తీరు కనిపిస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలతో కాలం గడుపుతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంపై బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రజలకు మేలు జరిగితే బీఆర్‌ఎస్ నాయకులకు ఎందుకు ఇబ్బందిగా ఉందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీశ్‌రావు ప్రతిరోజూ విమర్శలు చేయడం ద్వారా వారి రాజకీయ అసహనమే బయటపడుతోందని అన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తిస్తున్నారని, బీఆర్‌ఎస్ నేతల్లో అసహనం, నిరాశ, ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.






