1 July, 2026 | 1:18 AM

జూబ్లీహిల్స్‌లా మంథని!

01-07-2026 12:14 AM
  1. అభివృద్ధి బాటలో మంత్రపురి 
  2. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృషితో రూపాంతరం

మంథని జూన్ 30 (విజయక్రాంతి): ఒకప్పుడు ఇరుకైన రహదారులు, ట్రాఫిక్ కష్టాలు, కనీస సదుపాయాల లోపంతో వెనుకబడిన మంథని పట్టణం నేడు సరికొత్త హంగులతో వెలిగిపోతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో మంథని అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోంది. ఆయన దార్శనికత, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి పనులతో మంథని, హైదరాబాద్లోని ’జూబ్లీహిల్స్’ బంజారాహిల్స్ తరహాలో ఆధునిక పట్టణంగా రూపాంతరం చెందుతోంది.

అభివృద్ధి ఫలాలు..

రాబోయే తరాలకు మంథనిలో జరుగుతున్న అభివృద్ధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మంత్రి శ్రీధర్ బాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మంథని రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. పట్టణంలో దశాబ్దాలుగా వేధిస్తున్న ఇరుకైన రహదారుల సమస్యకు ఆయన శాశ్వత పరిష్కారం చూపుతున్నారు.

మంథని టౌన్‌లో విశాలమైన రహదారులు..

మంథనిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా టౌన్ లో ప్రధాన రహదారుల విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. త్వరలోనే పాత పెట్రోల్ బంక్ నుంచి మల్లెపెల్లి డిగ్రీ కళాశాల వరకు చేపట్టబోయే విస్తరణ పనులు పట్టణ స్వరూపాన్నే మార్చనున్నాయి. ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రహదారుల విస్తరణతో పాటు ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, పాదచారుల కోసం ఫుట్పాత్లు, విద్యుత్ దీపాల ఏర్పాటుతో పట్టణం రాత్రివేళల్లో సైతం సరికొత్త కాంతులతో వెలుగొండ నుంది.

కూరగాయల మార్కెట్‌కు సరికొత్త కళ.. రూ.2 కోట్ల నిధులు మంజూరు

మంథని పట్టణ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, పాత కూరగాయల మార్కెట్ను అత్యాధునిక హంగులతో పునర్నిర్మించేందుకు మంత్రి శ్రీధర్ బాబు శ్రీకారం చుట్టారు. పాత మార్కెట్ను కూల్చివేసి, ప్రజలకు అన్ని రకాల హంగులు వసతులు అందుబాటులో ఉండేలా రెండు కోట్ల రూపాయల వ్యయంతో కొత్త మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం మంత్రి శ్రీధర్ బాబు చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది పూర్తయితే వ్యాపారులకు, ప్రజలకు ఎంతో సౌకర్యంగా సౌలభ్యంగా ఉంటుంది.

శ్రీపాద రావు ఆశయాలను నెరవేరుస్తున్న మంత్రి.. శ్రీపాద మార్గంతో పర్యాటక శోభ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ళ శ్రీపాదరావు ఆశయాలను నెరవేరుస్తూ ఆయన కలలుకన్న మంథనిని ఆయన తనయుడు మంత్రి  శ్రీధర్ బాబు, మరో కుమారుడు టీపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ శ్రీపాద ఆశయాలను నెరవేరిస్తూ ముందుకు సాగుతున్నారు.

అందులో భాగంగానే మంథనిని కేవలం వాణిజ్య కేంద్రంగానే కాకుండా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి పని చేస్తున్నారు. కూచిరాజ్పల్లి నుంచి గోదావరి నది వరకు చేపట్టిన ’శ్రీపాద మార్గం’ నిర్మాణం భక్తులకు, పర్యాటకులకు గొప్ప వరం కానుంది. ఈ మార్గం పూర్తయితే గోదావరి తీరం పర్యాటక రంగంలో కొత్త మైలురాయిగా నిలవడమే కాకుండా, స్థానిక ఆర్థికాభివృద్ధికి రాబోయే తరాలకు ఎంతో తోడ్పడనుంది.

ప్రజల గుండెల్లో మంత్రి శ్రీధర్ బాబు

‘మంథని అభివృద్ధే నా లక్ష్యం‘ అని నిరంతరం శ్రమిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో జరుగుతున్న పనులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మంథని పట్టణానికి రావాలంటేనే ఇబ్బంది పడిన వారు, నేడు మారుతున్న దృశ్యాలను చూసి ఆనందంతో పాటు ఆశ్చర్యపోతున్నారు. మంత్రి  కృషితో మంథని కేవలం నియోజకవర్గ కేంద్రంగానే కాకుండా, తెలంగాణలో ఒక మోడల్ టౌన్గా గుర్తింపు పొందడం ఖాయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

అభివృద్ధి పనులన్నీ పూర్తిస్థాయిలో పూర్తయితే, మంథనిలో ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు చేరతాయని, పట్టణం సుందరమైన నివాస యోగ్యంగా మారుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంథని పట్టణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు కు మంథని వాసులు కృతజ్ఞతలు తెలిపారు.