1 July, 2026 | 1:53 AM

వైద్యో నారాయణో హరి..

01-07-2026 12:55 AM

కరీంనగర్, జూన్ 30 (విజయక్రాంతి): తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు.. తన కష్టనష్టాలను పక్కనబెట్టి రోగుల సేవలో తరిస్తాడు.. అత్యవసర పరిస్థితుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి నమ్ముకొని వచ్చిన వారిని రక్షిస్తాడు. అందుకే మన పెద్దలు వైద్యో నారయణోహరి అన్నారు. అన్ని వృత్తుల్లోకెల్లా వైద్యవృత్తి పరమ పవిత్రమైనది.

సమాజంలో వైద్యుల పాత్ర చాలా కీలకమైనది. విపత్కర పరిస్థితుల్లో కూడా వారు అందించే సేవలు అమోఘమైనవి. గతంలో అనేక వ్యాధులు, రోగాల బారి నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించారు. మన కండ్ల ముందే వీర విహారం చేసిన కరోనా వైరస్ను కూడా వైద్యలోకం సమర్ధవంతంగా ఎదుర్కొని మానవ జాతికి ఉపశమనం కలిగించారు. ఇలాంటి అనేక సందర్భాల్లో తమ సేవలందించి మానవ మనుగడను సురక్షితంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి సేవలను గుర్తు చేసుకొని గౌరవించేందుకు ఏటా జూలై 1న వరల్ డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం.

ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సిబ్బంది కరువు.. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లిలో ఉండే లక్షల మంది ప్రజలకు ఏకైక ప్రధాన ఆసుపత్రి కరీంనగర్ సివిల్ ఆసుపత్రి. ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తీవ్రతను బట్టి ఆయా ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. కడుపునొప్పి, జ్వరాలు, చెవి నొప్పి, తలనొప్పి, కాళ్ళ నొప్పులు లాంటి చిన్న చిన్న సమస్యలు వస్తే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేస్తారు. 

ఏదైనా ప్రమాదం జరిగి తలకు గాయాలైనా, గుండె సంబంధిత సమస్య వచ్చినా, మూత్రపిండాల సమస్య వచ్చి పరిస్థితి తీవ్రత అధికంగా ఉంటే మాత్రం జిల్లా ప్రధాన ఆసుపత్రికి వెళ్లాల్సిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రి 500 పడకల సామర్ధ్యం కలిగిన ప్రధాన ఆసుపత్రి. అలాంటి ఆసుపత్రిలో  కావలసినంత మంది వైద్య సిబ్బంది లేరు. వచ్చే పేషెంట్లకు వైద్య సేవలు సరిగా దొరకడం లేదు. సీరియస్ కండీషన్లో ఇక్కడకు వస్తే ప్రాణాలు గాల్లో దీపం పెట్టినట్టే ఉంటుంది.

ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రిలో సేవలు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో (కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలు) వివిధ స్థాయిలలో సుమారు 300 నుంచి 500 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కరీంనగర్ నగరంలోనే దాదాపు 100 వరకు మల్టీ-స్పెషాలిటీ, స్పెషాలిటీ మరియు కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. 

వైద్యుల శ్రేయస్సుకు మద్దతుగా నిలవడం అందరి బాధ్యత

దేశంలోని అత్యంత ప్రముఖులలో ఒకరైన డాక్ట ర్ బిధాన్ చంద్ర రాయ్ ను గౌరవించటానికి భారత దేశంలో జూలై 1 న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున వైద్యులకు కేవలం కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా, వారు ఎదుర్కొంటున్న మానసిక, శారీరక ఒత్తిళ్లను అర్థం చేసుకుని, వారి శ్రేయస్సుకు మద్దతుగా నిలవడం అందరి  బాధ్యత.

- బద్దం మనోజ్ కుమార్, ఎం.డి జనరల్ ఫిజిషియన్, కామాక్షి హాస్పిటల్, కరీంనగర్