1 July, 2026 | 12:47 AM

ఇల్లందు మున్సిపాలిటీలో సమస్యల తిష్ట

01-07-2026 12:04 AM

70 మంది అధికారులు.. 

24 వార్డుల్లో సమస్యలే సమస్యలు

ఒకప్పుడు 18 మంది ఉద్యోగులతోనే నిర్వహణ 

అధికారుల సంఖ్య పెరిగినా కనిపించని అభివృద్ధి

వార్డుల్లో పర్యటించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం

పారిశుధ్యం, డ్రైనేజీలు, రోడ్లు, వీధి దీపాల సమస్యలతో 24 వార్డుల ప్రజల అవస్థలు

ఇల్లందు టౌన్, జూన్ 30 (విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీలో అధికారుల సంఖ్య పెరుగుతున్నా పట్టణ ప్రజలకు మాత్రం సమస్యలు పరిష్కారం కావడం లేదు, ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదని ఆరోపనలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం 18 మంది శాశ్వత ఉద్యోగులతో మున్సిపాలిటీ నిర్వహణ సాఫీగా సాగగా, ప్రస్తుతం శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, అకౌంట్స్, వార్డు అధికారులతో కలిపి సుమారు 70 మంది అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజలకు కనిపించే అభివృద్ధి లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో పారిశుధ్యం, డ్రైనేజీలు, దెబ్బతిన్న రోడ్లు, వీధి దీపాల నిర్వహణ, చెత్త తొలగింపు తదితర సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వార్డు అధికారులు ప్రతిరోజూ వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో కనిపించకుండా ఎక్కువ సమయం కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజల సమస్యలు పేరుకుపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వార్డుల్లో అధికారులు అందుబాటులో లేకపోవడం, చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి వార్డు అధికారుల పనితీరును సమీక్షించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.