‘సిగాచి’ బాధితులను ఆదుకోవాలి
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో 2025 జూన్ 30 చీకటి రోజు అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో 54 మంది పేద కార్మికులు సజీవదహనమైన ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు నివాళులర్పించారు
. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ వైఫల్యం, సిగాచి కంపెనీ నిర్లక్ష్యం కారణంగా అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. దుర్ఘటన జరిగిన రోజు హైదరాబాద్‌లోని తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లోనే సీఎం ఉన్నా పరిశ్రమ వద్దకు రాలేదన్నారు. విమర్శల నేపథ్యంలో మరుసటి రోజు ఘటనా స్థలానికి వచ్చారని, బాధిత కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారని, ప్రభుత్వం తరఫున ఇచ్చింది కేవలం లక్ష రూపాయలేనన్నారు.
బాధిత కుటుంబాలకు ఇస్తానన్న ఉద్యోగాలు ఇప్పటికీ దిక్కులేవన్నారు. ప్రమాదంలో కాలి బూడిదై ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న దుర్మార్గపు ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచి కంపెనీ ఆస్తులను అమ్మి బాధిత కుటుంబాలకు భేషరతుగా కోటి రూపాయల పరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.






