సీఎస్‌గా సంజయ్ జాజు బాధ్యతలు
- సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్త సీఎస్
- సీఎం సలహాదారుడిగా బాధ్యతలు చేపట్టనున్న తాజా మాజీ సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు మంగళవానం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సంజయ్ జాజు ఎంసీహెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి తాజా మాజీ సీఎస్ రామకృష్ణారావుతో కలిసి నేరుగా సచివాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. కొత్త సీఎస్‌కు పలువురు ఐఏఎస్, ఐపీఎస్, వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉండనున్నారు. సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యతల్లో పనిచేశారు. క్షేత్రస్థాయి పోస్టులు, మరోవైపు రాష్ట్ర, జాతీయస్థాయిలో పాలనాపరమైన ఉన్నత హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్నది. ముఖ్యంగా ఈ గవర్నెన్స్, పరిపాలనలో డిజిటల్ వినియోగంపై సంజయ్ జాజుకు మంచి పట్టున్నది.
మీ సేవను తేవడంలో కీలక పాత్ర
మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్, ఎంబీఏ ఫైనాన్స్ చదివిన సంజయ్‌జాజు.. ఏపీలోని విజయవాడ సబ్‌కలెక్టర్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, హైదరాబాద్, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఈ గవర్నెన్స్ కార్యదర్శిగా ఉన్నప్పుడు ‘మీ సేవ’ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడంలో సంజయ్ జాజు కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు 2014 నుంచి 2018 వరకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ పూర్తి డిజిటల్ వ్యవస్థగా మారి జాతీయ ఈ గవర్నెన్స్ గోల్ అవార్డు అందుకున్నది. ఆ తర్వాత ఐదేళ్లు రక్షణ శాఖలో జాయింట్ సెక్రటరీ, అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. యూని యన్ సెక్రటరీగా పదోన్నతి పొందిన తర్వాత రెండేళ్లపా టు సమాచార, ప్రసారశాఖకు నేతృత్వం వహించారు.
అదనపు బాధ్యతలు
రెండేండ్లుగా ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్ జాజు ఇటీవలే తెలంగాణ క్యాడర్‌కు తిరిగి వచ్చారు. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక సీఎస్‌గా కూడా సంజయ్ జాజు అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. కీలకమైన ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు సీఎంవోలో ఏర్పాటు చేసిన స్పీడ్ విభాగం సీఈవోగా అదనపు బాధ్యతలూ నిర్వహిస్తారు. సీఎంవోలోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ ప్రత్యేక సీఎస్‌గా కూడా వ్యవహరిస్తారు. ఇప్పటివరకు సీఎస్‌గా కొనసాగిన రామకృష్ణారావు పదవీ విరమణ చేశారు. రామకృష్ణావును ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డికి సలహాదారుడిగా నియమించడంతో బాధ్యతలు చేపట్టనున్నారు.






