8 June, 2026 | 1:00 PM

నాంపల్లిలో 'చేపప్రసాదం' పంపిణీ.. భారీగా వస్తున్నా ప్రజలు

08-06-2026 11:52 AM

హైదరాబాద్: మృగశిర కార్తి సందర్భంగా చేప ప్రసాదాన్ని(Fish Prasadam) స్వీకరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు(Nampally Exhibition Grounds) చేరుకుంటున్నారు. వార్షిక చేప ప్రసాద పంపిణీ జూన్ 8న రాత్రి 9 గంటలకు ప్రారంభమై, జూన్ 9న రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. బత్తిని కుటుంబ సభ్యులు ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు, మూలికా మిశ్రమం, సజీవ చేపతో కూడిన 'చేప ప్రసాదాన్ని' ఉచితంగా అందిస్తారు. 176 ఏళ్లుగా చేప ప్రసాదం పంపిణీ సంప్రదాయం కొనసాగుతోంది.

దీనికి అనుగుణంగా, మత్స్యశాఖ చేప ప్రసాద పంపిణీ కోసం 1.4 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. మత్స్య ప్రసాద పంపిణీ సజావుగా జరిగేందుకు హైదరాబాద్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద ప్రత్యేక కౌంటర్లు, భారీ క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. సరైన క్యూ వ్యవస్థ ఉండేలా చూసేందుకు తగినంత మంది పోలీసులను మోహరించారు. అనవసర గందరగోళాన్ని నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు నియంత్రణలు, దారి మళ్లింపులు విధించారు. నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

వాటర్ ప్రూఫ్ జనరేటర్లను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. గత దుర్ఘటన నేపథ్యంలో పటిష్ట చర్యలతో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లు, అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. వాట్సాప్ గ్రూపులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షిస్తున్నారు. భద్రత కోసం భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భోజనం, వసతి సదుపాయాలు కల్పించారు. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా ఆర్సీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అంబుబలెన్సులు, మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.