21 April, 2026 | 4:43 AM

పచ్‌ప్రద ఆయిల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం

21-04-2026 03:08 AM
  1. ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు అపశ్రుతి
  2. మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తుండగా ఘటన 

జైపూర్, ఏప్రిల్ 20: రాజస్థాన్‌లోని పచ్‌పద్రలోని ఆయిల్ రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు ఈ ఘటన జరిగింది. క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ (సీడీయూ)లో మంటలు చెలరేగడంతో, రిఫైనరీ ప్రాంగణమంతా దట్టమైన పొగ కమ్ముకున్నది. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

బలోత్రా, సమీప ప్రాంతాల నుంచి డజన్ల కొద్దీ అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. రాజస్థాన్ ముఖ్యకార్యదర్శి వీ శ్రీనివాస్, సీనియర్ పరిపాలనా అధికారులు, పోలీసు సిబ్బంది, భద్రతా బృందాలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముందుజాగ్రత్త చర్యగా, సీడీయూ యూనిట్, చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఏప్రిల్ 21న ఒక రిఫైనరీ యూనిట్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో, దానికి ముందు రోజు ఈ సంఘటన జరిగింది.

ఈ కార్యక్రమానికి ముందు భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కూడా సోమవారం సంఘటనా స్థలాన్ని సందర్శించాల్సి ఉంది. పచ్‌పద్రలోని ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక దశలను చూసింది. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో, 2013 సెప్టెంబర్ 22న సోనియా గాంధీ దీనికి శంకుస్థాపన చేశారు. దీని ప్రాథమిక అంచనా వ్యయం రూ.37,230 కోట్లు.

ప్రభుత్వం మారిన అనంతరం, ప్రధానమంత్రి మోదీ 2018 జనవరి 16న, రూ.43,129 కోట్ల సవరించిన వ్యయ అంచనాతో ఈ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించారు. ఈ మొత్తాన్ని రూ.79,459 కోట్లకు సవరించేందుకు ఇటీవలే కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. ఈ రిఫైనరీ హిందుస్థాన్ పెట్రలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెపీసీఎల్), ప్రభుత్వ సంయుక్త సంస్థ.

ఇది మంగళవారం(ఏప్రిల్ 21)న అందుబాటులోకి వచ్చి ఉంటే దేశంలోని భారీ అనుసంధానిత రిఫైనరీ పెట్రో రసాయనాల కాంప్లెక్స్‌ల్లో ఒకటిగా ఉండేది. ఈ ప్రాజెక్టు మొత్తం వార్షిక సామర్థ్యం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు. అయితే ఇందులో ప్రెటోరసాయనాల ఉత్పత్తుల సామర్థ్యం 2.4 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండడం గమనార్హం.