6 April, 2026 | 10:34 PM

రోడ్డుపై ప్లాస్టిక్ వ్యర్థాలు వేసినందుకు భారీ జరిమానా

06-04-2026 08:29 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే చర్యల్లో భాగంగా మున్సిపల్ అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం చంద్రంపేట 12వ వార్డులో రోడ్డుపై ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేసిన వ్యక్తికి రూ.5,000 భారీ జరిమానా విధించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు నివాస ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా చెత్తను, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయడం వల్ల ప్రజారోగ్యానికి. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అధికారులు హెచ్చరించారు.

ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య నియమాలను పాటించాలని, చెత్తను మున్సిపల్ వాహనాలకే అందించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా వదిలేది లేదని, భారీ జరిమానాలతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్‌తో పాటు మున్సిపల్ జవాన్ ప్రవీణ్ మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.