సుధాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం
కల్లూరు, మే 20 (విజయక్రాంతి): మండల పరిధిలోని ముగ్గు వెంకటాపురం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడు ఎక్కిరాల సుధాకర్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సుధాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగ్ నరసింహారావు,వేము రాంబాబు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి మల్లేష్ తదితరులు పాల్గొని సుధాకర్ భార్య నాగమణికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సింగ్ నరసింహారావు మాట్లాడుతూ, మరణించిన పంచాయతీ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే సాధారణ భీమా, ప్రమాద భీమా, ఆరోగ్య భీమా వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు.సుధాకర్ ఎన్నో సంవత్సరాలుగా పంచాయతీ కార్మికునిగా పనిచేస్తూ పారిశుధ్యం, ఇంటి బిల్లుల వసూళ్లు తదితర సేవల ద్వారా గ్రామ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






