డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
కూకట్‌పల్లి, మే20 (విజయక్రాంతి): కూకట్‌పల్లి నియోజకవర్గం డివిజన్ పరిధి విజ్ఞానపురి కాలనీలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం పరిశీలించారు. రోడ్డు కంటే డ్రైనేజ్ పైపుల నిర్మాణాలు ఎత్తు పెరగడం వల్ల వర్షం వచ్చినప్పుడు నీరు ఎలా చేరుతుందని అధికారులను ప్రశ్నించారు. డ్రైనేజీని రోడ్డుకు సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా నాలాలను సరిదిద్దాలని, డ్రైనేజీలోకి నీరు వెళ్ళేవిధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కాజాకుంట ఎస్టీపీ ప్లాంట్ వద్ద నీటిశుద్ధి దశలో ఇబ్బందులు దుర్గంధం వస్తుందని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన కృష్ణారావు ఎస్టీపీ ప్లాంట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి దుర్గంధం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, బొట్టు విష్ణు, పవన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.






