ఎరువు కరువు!
తొలకరికి ముందే అన్నదాతకు యూరియా కష్టాలు
డిమాండ్ మేరకు సరఫరా చేయని కేంద్ర ప్రభుత్వం
- ఏప్రిల్, మే నెల కోటా 4 లక్షల టన్నులు
- వచ్చింది అందులో సగమే
- వరి నార్లు పోస్తున్న రైతులు గత అనుభవాలతో ముందుగానే కొనుగోలు
- కొన్ని చోట్ల కృత్రిమ కొరత, అధిక ధరకు విక్రయం
హైదరాబాద్, జూన్ 7(విజయక్రాంతి): పంట అమ్మాలన్నా.. ఎరువులు కొనుగోలు చేయాలన్నా రైతన్నకు ఏటా ప్రహ సనంగా మారింది. నిద్రాహారాలు మాని కొనుగోలు కేంద్రాలు, ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోం ది. యాసంగి సీజన్‌లో పంట ఉత్పత్తులను విక్రయించడానికి కొనుగోలు కేం ద్రాల్లో రైతులు పడ్డ కష్టాలు కళ్లముందు కదులాడుతూనే ఉన్నాయి. ఎరువుల కోసమూ నానా అవస్థలు పడ్డారు.
వేకువజాము నుంచే పీఏసీఎస్ కార్యాలయా లు, ఎరువుల దుకాణాల వద్ద గంటల కొద్ది క్యూలైన్లలో నిరీక్షించారు. కొన్నిచోట్ల చెప్పులను లైన్లలో పెట్టిన పరిస్థితిని చూశాం. ప్రభుత్వం యూరియా యాప్ తీసుకొచ్చినా ఇబ్బందులు తప్పలేదు. అయినా ప్రభుత్వం గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రైతాంగం ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధమవుతోంది. రైతు లు వరి నార్లు పోస్తుండగా, ఇప్పటికే 1.03 లక్షల ఎకరాల్లో కూరగాయలు, ఇత ర ఉద్యాన పంటల సాగు చేస్తున్నారు.
అందుకు గాను ఈ వానాకాలం సీజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా 11.50 లక్షల టన్నుల యూరియా అవసరమని, రాష్ట్రానికి సరిపడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభు త్వం కేంద్రాన్ని కోరింది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ఇతర పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభు త్వం 10 లక్షల టన్నులకే అనుమతించింది. అయితే ఏప్రిల్ నెలలో 2 లక్షల టన్నుల యూరియా సరఫరా కావాల్సి ఉన్నప్పటికి 1.53 లక్షల టన్నులు, మే నెల లో 2 లక్షల టన్నులకు కేవలం 48,985 టన్నుల యూరియా మాత్రమే వచ్చింది.
ప్రస్తుతం రాష్ట్రం వద్ద 1.40 లక్షల టన్నుల యూరియాతో పాటు 10 వేల టన్నుల డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వానాకాలం సాగు కోసం యూరియాకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులే కనిపి స్తున్నాయి. అయితే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మెల్కొంటుందా? అనేది సందే హంగా మారింది.
పాత స్టాక్.. కొత్త రేట్లు..
రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఎరువుల వ్యాపారులు అక్రమాలకు తెరలేపుతులన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రాష్ట్రంలో ఎరువుల దందా మొదలైంది. వరి నార్లు పోస్తున్న రైతులు.. అందుకు గ్రోమోర్, యూరియాను కొనుగోలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో పాత స్టాక్‌ను కొత్త ధరలతో విక్రయించడం, ఎమ్మార్పీకి మించి డబ్బులు వసూలు చేయడం, అవసరం లేని పురుగుమందులను బలవంతంగా కట్టబెట్టడం వంటి చర్యలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సాగు పనులు ఊపం దుకుంటున్న వేళ రైతులు ఎరువుల దుకాణాల వద్ద బారులు తీరుతు న్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు డీలర్లు అధిక ధరల వసూళ్లకు పాల్పడుతున్నారు. కేంద్రం ఇటీవల కొన్ని ఎరువుల ధరలను పెంచిన నేపథ్యంలో, తమ వద్ద ఇప్పటికే ఉన్న పాత స్టాక్ ను కూడా కొత్త రేట్లకు విక్రయిస్తున్నారు.
50 కిలోల కాంప్లెక్స్ ఎరువు (20: 20:0:13) బస్తాను ఎంఆర్పీ ప్రకారం రూ. 1400కు అమ్మాలి. కానీ, రూ.1500 నుంచి రూ.15 80 వరకు అమ్ముతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. డీఏపీకి కృత్రిమ కొరత సృష్టించి, రూ.1350 ధర ఉన్న బస్తాను రూ.1,600 వరకు అమ్ముతున్నారని చెబుతున్నారు.
పురుగుమందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు..
ఎరువులు కావాలంటే తప్పనిసరిగా పురుగు మందులు, సూక్ష్మపోషకాలు లేదా ఇతర వ్యవసాయ సామగ్రి కూడా తీసుకోవాలని వ్యాపారులు షరతులు పెడుతున్నట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేకపోయినా బలవంతంగా వాటిని కొనిపిస్తున్నా రని వాపోతున్నారు. ప్రశ్నించిన రైతులకు ఎరువులు లేవని, కావాలంటే తాము చెప్పినవి కూడా తీసుకోవాలని సమాధానం ఇస్తున్నారని రైతులు అంటున్నారు.
దీంతో సాగు ఖర్చులు మరింత పెరిగి రైతులపై అదనపు భారం పడనుంది. మరోవైపు ఎరువుల ధరలు, నిల్వలు, సరఫరాపై పర్యవేక్షణ చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడం లేదని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. అధిక రేట్లకు ఎరువులు అమ్ముతున్న డీలర్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లైసెన్స్ రద్దు చేయాలని కోరుతున్నాయి.






