5 June, 2026 | 8:27 PM

పర్యావరణ పరిరక్షణలో యువత ముందుండాలి

05-06-2026 07:18 PM

– పీసీసీఎఫ్ వినయ్ కుమార్

- ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026ను ఘనంగా నిర్వహించిన ఎఫ్‌సీఆర్ఐ

 గజ్వేల్: పెరుగుతున్న పర్యావరణ సమస్యలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో అడవులు, వన్యప్రాణులు, సహజ వనరుల పరిరక్షణ అత్యంత అవసరమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ, ప్రధాన అటవీ బలగాల అధిపతి, వన్యప్రాణుల విభాగం ప్రధాన అటవీ సంరక్షణాధికారి, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ వినయ్ కుమార్ అన్నారు. యువత పర్యావరణ పరిరక్షణకు రాయబారులుగా మారి పచ్చ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అటవీ శిక్షణా అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ప్రియాంకా వర్గీస్ మాట్లాడుతూ పర్యావరణ విద్య, సామర్థ్యవృద్ధి, ప్రజల భాగస్వామ్యం ద్వారానే స్థిరమైన అభివృద్ధి సాధ్యమన్నారు. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రణాళిక మరియు పర్యవేక్షణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. ఉమేష్ కన్నా వాతావరణ మార్పుల నియంత్రణలో అడవుల పాత్రను వివరించగా, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కె. శ్రీనివాస్ సుస్థిర సహజ వనరుల నిర్వహణపై ఉపన్యాసం అందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కులకర్ణి శశికాంత్ వాతావరణ మార్పులు, సముద్ర మట్టం పెరుగుదల, సామాజిక–ఆర్థిక అభివృద్ధి మార్గాలపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు.

ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, పర్యావరణవేత్త జయరాజు ప్రకృతి–మనిషి మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని హృదయానికి హత్తుకునేలా వివరించారు. కార్యక్రమం ముగింపులో విశిష్ట అతిథుల సమక్షంలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేపట్టిన కార్యక్రమాల నివేదికను అధికారులు సమర్పించారు. ఈ సందర్భంగా అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ డీన్ శ్రీమతి బి. ప్రవీణ మాట్లాడుతూ పర్యావరణ విద్య, సుస్థిర అభివృద్ధి, సమాజ భాగస్వామ్యానికి సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, అటవీశాఖ అధికారులు, పర్యావరణ నిపుణులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.