4 July, 2026 | 3:55 AM

అంకుసాపూర్‌లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భూమిపై రైతుల ఆందోళన

04-07-2026 12:00 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 3(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని అంకుసాపూర్ గ్రామ శివారులో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం కేటాయించిన భూమిపై రైతులు తీవ్ర ఆందోళన చేపట్టారు. రూ.200 కోట్ల వ్యయంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం సర్వే నంబర్ 87/టిటి లో 17.24 ఎకరాల భూమిని కేటాయించగా, అది ప్రభుత్వ భూమి కాదని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

తమ తాతల కాలం నుంచి ఆ భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఆ భూమిని ప్రభుత్వ అవసరాల పేరుతో తీసుకోవద్దని రైతులు డిమాండ్ చేశారు.పాఠశాల నిర్మాణ పనుల కోసం తీసుకొచ్చిన కంటైనర్ గదులను ఏర్పాటు చేయకుండా రైతులు అడ్డుకున్నారు. పనులు నిలిచిపోవడంతో తహసీల్దార్ రియాజ్ అలీ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని, ప్రభుత్వ భూమినే స్వాధీనం చేసుకుంటామని రైతులకు వివరించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ రైతులు ఆందోళన విరమించలేదు.ఓ రైతు తహసీల్దార్ కాళ్లు మొక్కు తమనితమ భూమిని కాపాడాలని వేడుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నో ఏళ్లుగా ఈ భూమినే నమ్ముకొని సాగు చేసుకుంటూ బతుకుతున్నామని, ఇప్పుడు భూములను లాక్కొని రోడ్డుపై పడేయవద్దని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, లేకుంటే చావే శరణ్యమని తేల్చి చెప్పారు. భూముల విషయంలో పూర్తి స్పష్టత ఇచ్చి తమకు నష్టం కలగకుండా చూడాలని రైతులు అధికారులను కోరారు.