27 March, 2026 | 2:46 AM

పంట నష్టపరిహారం ఎప్పుడు?

27-03-2026 12:51 AM

ఇదిగో అదిగో సాయం అంటూ మాటలకే పరిమితం అన్నదాతల దైన్యం

పంట నష్టపరిహారం కోసం రైతుల  ఎదురుచూపు లు

పంటలు వేసే సమయం వచ్చిన పరిహారం చెల్లింపు పట్ల పట్టింపు లేదు

సీఎం హామీ ఇచ్చిన పరిహారంకు నోచుకోని రైతులు 

ఎల్లారెడ్డి, మార్చి26 (విజయక్రాంతి): భారీ వర్షాల వల్ల నిజాంసాగర్ బ్యాక్ వాటర్ తో 9వేల ఎకరాల పంట నీట మునిగి రైతులు నష్టపోయారు. దిక్కుతోచని స్థితిలో రైతులు పంటనష్టం వల్ల అప్పులు తీర్చలేక  రైతులు, కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వేసిన పంటలు ఏపుగా పెర గడంతో యూరియా, ఇతర రసాయన ఎరువుల కోసం పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో అంతా భారీ వర్షాల వల్ల వరి పంట అంతా నీటి పాలైంది. 

పట్టాదారులకు కాకుండా పంట సాగు చేసిన వారికి పరిహారం అందించాలని కోరుతున్నారు.ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలతో పాటు అడపా దడపా కురుస్తున్న వర్షాలు, పొంగుతున్న వాగులు అన్నదాతకు కన్నీటిని మిగులుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో వర్ష ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరగడంతో అన్నదాత ఊహించని రీతిలో తీవ్రంగా నష్టాల పాలు కావాల్సి వచ్చింది. ఇసుక మేటలు వేసి, పంటలు నీట మునిగి, నేలకొరిగి, మురిగిపోయి అన్నదాతలు భారీగా నష్ట పోయారు. పంట నష్టం అంచనా వేసిన అధికారులు నివేదికలను ప్రభుత్వానికి పంపినా, నష్ట పరిహారం విషయంలో స్పష్టమైన ప్రకటనేది ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. దీంతో పంటలు నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదిరుచూస్తున్నారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని ఎల్లారెడ్డి ,నాగిరెడ్డి పేట,లింగంపేట,తాడ్వాయి, మండలంలోని పలు గ్రామాలలో చేతికొచ్చిన పంట పొలంలో బారి వరదల కారణంగా నీటమునిగి,పంట మురిగిపోయింది.ప్రధాన రహదారులు సైతం ధ్వంసం అయ్యాయి.కామారెడ్డి జిల్లాలోని  మూడు నెలల క్రితం కురిసిన అతి భారీ వర్షాలకు 270 మండలాల పరిధిలోని 2,463 గ్రామాల్లో 2.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సెప్టెంబర్ నెలాఖరులో కురిసిన వానలకు,ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి, జిల్లాలో వేల ఎకరాల్లో వరి, పంటలు నీటిలో మునిగినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వీటికి పంట నష్ట పరిహారం ఇచ్చే అంశంపై ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

పెట్టుబడి అంతా గంగ పాలు

ప్రస్తుతం విత్తనాలు, కూలీలు, ట్రాక్టర్, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని వాటిని చెల్లించి పంటలు వేశామని తీరా చేతికందే సమయానికి వర్షాలకు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై, ఆగస్టులో కురిసిన వానలకు కామారెడ్డి,జిల్లాలోని రైతులు తీవ్ర నష్టపోయారని,ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు కృషి చేయాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు.

ఇసుక మేటలు వేసిన వారి సంగతి

 కాగా ఇసుక మేటలు వేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆ రైతులను కూడా ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు వేల ఎకరాలలో వరద నష్టం జరిగింది. కాగా ఇసుక మేట వేసిన పంట పొలాలు ఈ ఏడాది మొత్తం పంట నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక మేటలు వేసి పంట ఆనవాళ్లు లేకుండాపోయాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి డివిజన్ లోని  అనేక గ్రామాలలో నేటికీ పంట పొలాలు ఇసుక మేటలతో దర్శన మీచ్చాయి. కాగా ఆ పంట పొలాలు బాగుచేయాలంటే ఎకరానికి రూ.30 నుంచి రూ.50వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వరద సహాయం కింద రూ.10వేలు ఇచ్చిన ప్రభుత్వం ఇసుక మేటలు తొలగించు కునేందుకు ప్రభుత్వం ఎలాంటి సహా యం ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఇప్పటికే ఖర్ఫీలో ఎకరానికి రూ.20వేల పైనే ఖర్చు చేసి సాగుచేశారు. అందులోనూ పంట మొత్తం వరదపాలు కాగా ఇసుక మేటలు ఆ రైతులకు తలకు మించిన భారంగా మారాయి. ఇసుక మేటలు తొలగించి పొలాల్లో మట్టిని తరలించి మడులు కట్టాలంటే కనీసం ఎకరానికి రూ.30వేల పైనే ఖర్చవుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పంటల సాగుకోసం పెట్టిన పెట్టుబడి తిరిగి పెద్ద మొత్తంలో అంతుందనుకున్న రైతు ఆశలు ఆవిరై పోయాయి. ఈ నష్టంతో కుంగిపోతున్న రైతులకు ప్రభుత్వ సాయం కూడా అందదన్న భయం పట్టుకుంది.

ప్రభుత్వ నిబంధన ప్రకారం అధికారులు పంట నష్టాన్ని పరిశీలించాలంటే వర్షానికి పంట కొట్టుకుపోతేనో, ఇసుక మేటలు ఉంటేనో పంట నష్టపరిహారం కింద పరిగణించవచ్చని అధికారులంటున్నారు. పరిహారంపై అధికారులు రైతులకు చెప్తున్న నిబంధనలు రైతన్నల ఆవేధనను రెట్టింపు చేస్తున్నాయి. ఇక రైతులే నేరుగా నష్టం గురించి అధికారులకు ఫిర్యాదు చేస్తే, వారు చెప్పిన సమాధానాలు రైతుల ఆశలను పూర్తిగా ఆవిరి చేస్తున్నాయని ఈ సందర్భంగా  రైతులంటున్నారు.

ప్రభుత్వంపై ఆశలు..

రూ. లక్షల్లో నష్టాలు వచ్చి, పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను మార్చి, సహేతుక నిబంధనలతో నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లేకపోతే, అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవితాలు చిక్కుల్లో పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకుంటుందనే గంపెడు ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.  నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం పంట దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించింది. నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

పంటలు వేసే సమయం వచ్చే.. పరిహారం అందకపోయే

భారీ వర్షాల కారణంగా పంట ముంపుకు  గురైన రైతులకు ఆర్థిక సహాయం అందునొ అందకపోవునో ఆ దేవుడు చేతిలోనే ఉందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వరదల కారణంగా పంట పొలాల్లో ఇసుకమేటలు, చెట్లు, రాళ్లు కుప్పల కుప్పలుగా చేరి, రైతులకు పంట పెట్టుబడి కంటే అధిక నష్టం వాటిలిందని అయినప్పటికీ ప్రభుత్వం రైతుల పట్ల సానుభూతి చూపకపోవడం పరిహారం అందించ కపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతకు ఈ సంవత్సరం కురిసిన వర్షానికి తీరని అవస్థ ఎదురయిందని ప్రస్తుతం మళ్లీ పంటలు వేసుకునే సమయం వచ్చినప్పటికీ పంట పొలాన్ని చదును చేసుకోవడం అన్నదాతకు భారంగానే మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంట నష్ట పరిహారం వివరాలను ప్రభుత్వానికి నివేదించాము 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి సబ్ డివిజన్లో ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట, తాడ్వాయి, సదాశివ నగర్ గాంధారి, రామారెడ్డి, మండలాల్లో సుమారు 8,వేల ఎకరాల్లో, పంట నష్టం వాటిల్లిందని, మండల వ్యవసాయ, అధికారులతో, క్షేత్రస్థాయి పంట పరిశీలన చేశామని నష్టపోయినా రైతుల పట్ల పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని వ్యవసాయ ఎల్లారెడ్డి డివిజన్ అధికారి సుధా మాధురి తెలిపారు.

యం సుధామాధురి. ఏ ఏ డి ఏ, ఎల్లారెడ్డి,  కామారెడ్డి జిల్లా