1 March, 2026 | 6:50 PM

యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

01-03-2026 02:52 PM

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో యూరియా కొరతపై రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఆదివారం స్థానిక ఆగ్రో సేవా కేంద్రంలో 200కు పైగా యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం అందించారు. దీంతో రైతులు పెద్ద సంఖ్యలో దుకాణం వద్దకు చేరుకుని తమ ఫోన్లలో యాప్ ద్వారా బుకింగ్ చేసుకునేందుకు నిరీక్షించారు.

ఉదయం 10:30 గంటలకు యాప్ ఓపెన్ చేయగానే క్షణాల్లోనే బస్తాలు పూర్తిగా అమ్ముడైపోయినట్లు కనిపించడంతో రైతులు అవాక్కయ్యారు. తమ ముందే యాప్ ఓపెన్ చేసి చూస్తుండగానే అన్ని బస్తాలు ఎలా అయిపోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు హైదరాబాద్ చౌరస్తాలో రహదారిపై ఆందోళనకు దిగడంతో భారీగా వాహనాలు స్తంభించాయి. సమాచారం అందుకున్న సీఐ నాగార్జున తన సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులతో చర్చించి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం రైతులు ఆందోళన విరమించారు.