1 March, 2026 | 4:57 PM

షుగర్ వ్యాధి బాధితులకు అవగాహన అవసరం

01-03-2026 02:55 PM

అవగాహన చికిత్స లేకుంటే కాలు పోయే ప్రమాదం- డా శ్రీకాంత్ రాజు

హనుమకొండ,(విజయక్రాంతి): డయాబెటిస్ రోగుల్లో కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం (పిఏడి)పై అవగాహన అత్యవసరమని సీనియర్ కన్సల్టెంట్ వాస్క్యులర్ సర్జన్ డా. ఎస్ శ్రీకాంత్ రాజు అన్నారు. ఆదివారం యశోద ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాబెటిస్ ఉన్నవారిలో పిరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (పిఏడి) సమస్య వేగంగా పెరుగుతోందని, డయాబెటిస్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండి, చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి తెలియకపోవచ్చని హెచ్చరించారు.

నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, కాళ్లు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండటం, మానని గాయాలు, వేళ్లు నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో కాళ్ల రక్తపోటు పరీక్ష, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు. డయాబెటిస్ రోగులు రక్త చక్కెరను కట్టుదిట్టంగా నియంత్రించుకోవాలని, పొగతాగడం పూర్తిగా మానాలని, అవసరమైతే మందులు లేదా యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి రోజు పాదాలను పరిశీలించడం, గాయాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ముందస్తు అవగాహన, సకాలంలో చికిత్సతో కాలు కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని అన్నారు.