13 July, 2026 | 1:02 AM

నిరుపేదలకు అందని కంటి వైద్యం

13-07-2026 12:01 AM
  1. ప్రభుత్వాల నిర్లక్ష్యం.. జిల్లాలో వైద్యుల కరువు
  2. కంటి వెలుగు ఆప్తోమ్స్ జీవితాల్లో అలుముకున్న చీకట్లు

ఖానాపూర్. జులై 13. (విజయక్రాంతి) ప్ర భుత్వాలు మారుతున్న నిరుపేదలకు కంటి వైద్యం అందని ద్రాక్ష గానే మిగిలిపోయిందన్నది జగమెరిగిన సత్యం.గత ప్రభుత్వాల పా లనలో ’కంటి వెలుగు’ పథకం పేరిట సేవలు అందించిన కంటి వైద్య సహాయకులను కరివేపాకుల వాడుకొని వదిలేసిన ’ఆప్తోమ్స్’ (పారా మెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్)జీవితా ల్లో చీకట్లు అలుముకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైద్య రంగంలో అనేక నియామకాలు చేపట్టినప్పటికీ కంటి వైద్యంపై నిర్లక్ష్యం కొట్టొ చ్చినట్లు కనిపిస్తుందంటున్నారు. దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు నిరుపేదలకు కంటి వై ద్యం అందించడంలో విఫలం అవుతూ వస్తోందన్నది పలువురి అభిప్రాయం .

దీం తో కంటి వైద్యం పేరిట నిరుపేదలు ఆర్థికం గా నష్టపోతున్నారు. ఈ రోజుల్లో ప్రధానంగా కంటి సమస్యలు చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా పోయింది. పేద ,ధనిక అనే తారతమ్యం లేదు. వాతావరణ ప్రభావాలు, ఆహార నియమాలు, ఇతర బలహీనతలతో ప్రతి ఒక్కరూ కంటి బలహీనతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజా వైద్యానికి పెద్ద పీఠ వేస్తున్నప్పటికీ  కంటి వైద్యుల, కంటి వైద్య సహాయకుల,నియామకం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో కంటి వైద్యం అందకుండా పోయింది.

ఈ నేపథ్యంలో కిందిస్థాయి కడుపేదలకు కంటి వైద్యం అందాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ ఆరోగ్య కేంద్రాలు ,పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కనీసం నేత్ర వైద్య సహాయకులను నియమించాల్సి ఉండగా అలాంటి దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదన్నది పలువురి వాదన .పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల్లో వైద్య సహాయకులను నియమించుకొని ప్రభుత్వాలు నేత్ర వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో కంటి వైద్య సహాయకుల సేవలు వినియోగించుకుని అనంతరం వారిని తీసివేయడంతో వేలాదిమంది ఆప్ టోమ్స్ జీవితాల్లో కూడా నిరాశ, నైరాశ్యం, చోటుచేసుకుంది. కాగా ప్రస్తుతం అనేక జిల్లాల్లో ప్రభుత్వ కంటి వైద్య సహాయకులు ఒక్కరూ, లేదా ఇద్దరు మాత్రమే ఉండడం వారు కూడా రిటైర్మెంట్ కి సమీపంలో ఉండడం కూడా కంటి వైద్యం నిరుపేదలకు అందని కారణంలో  ఒకటి గా మారింది.

కనీసం ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతి నయిన వైద్య సహాయకులను నియమించి వారి సేవలను వినియోగించుకుంటే కడుపేదలకు కంటి వైద్యం అందించిన వారు అవుతారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు వేలాదిమంది ’ఆప్తోమ్స్’ జీవితాల్లో వెలుగులు నింపిన వారవుతారని నిరాశలో ఉన్న ఆప్తోమ్స్ అభిప్రాయపడుతున్నారు.