13 July, 2026 | 1:59 AM

గుడిసెలో అంగన్వాడీ...

13-07-2026 12:55 AM
  1. వర్షానికి తడుస్తున్న చిన్నారులు 
  2. అధికారుల నిర్లక్ష్యానికి కొత్తపల్లి నిదర్శనం  
  3. తాత్కాలిక భవనం ఇవ్వాలని తల్లిదండ్రుల వేడుకోలు

చర్ల, జులై 12: ( విజయక్రాంతి )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం దుస్థితి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వర్షాలు మొదలై రెండు నెలలు దాటినా చిన్నారులు ఆ గుడిసెలోనే ఉంటున్నారు. గ్రామంలో అంగన్వాడీ-1, అంగన్వాడీ-2 రెండు కేంద్రాలు ఒకే చిన్న గుడిసెలో నడుస్తున్నాయి. పైన టార్పాలిన్ కవర్లు, చుట్టూ గోడలు లేని షెడ్. లోపలంతా తడి, బురద. కరెంటు సౌకర్యం లేదు. బాత్రూం సౌకర్యం లేకపోవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే నీళ్లు లోపలికి కారుతున్నాయి.

వార్తలు ప్రచురతమైన స్పందన శూన్యం :ఇదివరకు ‘దిక్కులేని అంగన్వాడీ‘, ‘గుడి పేరుతో బడికి ఎసరు?‘ అంటూ పత్రికల్లో కథనాలు వచ్చినా ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయ భవనం చూపించేందుకు అధికారులు చొరవ చూపలేదనీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దెకు ఇల్లు ఇవ్వాలని టీచర్లు గ్రామస్తులను కోరినా వారు నిరాకరించారు.

స్కూల్లో గది ఇవ్వడానికీ అభ్యంతరం :నీసం వర్షాకాలం 3 నెలల పాటు పాఠశాలలో ఒక గది కేటాయించాలని కోరితే స్కూల్ హెడ్ మాస్టర్, మండల ఎంఈఓ అభ్యంతరం వ్యక్తం చేశారని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రాణాలతో చెలగాటం:  కరెంటు లేని, వర్షపు నీరు కారుతున్న గుడిసెలో చిన్నారులను కూర్చోబెట్టడం ప్రమాదకరంగా మారిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో, సిడిపిఓ, ఎంఆర్వో, ఎమ్మెల్యే ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు.

శాశ్వత పరిష్కారం కావాలి  : తక్షణమే కొత్తపల్లి అంగన్వాడీకి శాశ్వత భవనం కేటాయించాలని, లేదా తాత్కాలికంగా పాఠశాలలో స్థలం ఇవ్వాలని గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.