13 July, 2026 | 1:59 AM

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం..

13-07-2026 12:58 AM

అశ్వాపురం, జూలై 12, (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించకుండా ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మాత్రమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం అశ్వాపురం పర్యటనకు వచ్చిన ఆయనకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం వాటి పరిష్కారంపై చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలను విస్మరించి ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుంచి మళ్లించేందుకు రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కూడా ప్రభుత్వం కావాలనే అపోహలు సృష్టిస్తోందని ఆరోపించిన పువ్వాడ అజయ్ కుమార్, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద 96.79 మీటర్ల నీటిమట్టం నమోదైందని, 94 మీటర్ల వద్దనే పంపులను ప్రారంభించే అవకాశం ఉందని, మరో వంద రోజుల పాటు ఇదే స్థాయిలో ప్రవాహం కొనసాగే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.

రోజుకు రెండు టీఎంసీల చొప్పున వంద రోజుల్లో 200 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే గోదావరి బేసిన్లోని రిజర్వాయర్లను నింపి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చని ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. తాను మంత్రిగా పనిచేసిన సమయంలో మేడిగడ్డ నుంచి భద్రాచలం వరకు 25 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినప్పటికీ ఎలాంటి సమస్యలు తలెత్తలేదని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుతం అంతటి వరద కూడా లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, అశ్వాపురం మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, మర్రి మల్లారెడ్డి, పార్టీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.