‘నీట్’కు 15 నిమిషాల అదనపు సమయం
ఉత్తర్వులు జారీ చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ఈ నెల 21న నీట్ యూజీ పరీక్ష రాసే విద్యార్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. వారికి 15 నిమిషాలు అదనపు సమయం కేటాయించింది. పరీక్ష సమయాన్ని గతంలో ఉన్న 3 గంటల (180 నిమిషాలు) నుంచి 3 గంటల 15 నిమిషాలకు అంటే 195 నిమిషాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రంలో సంతకాలు చేయడం, ఇతర తనిఖీల వల్ల విద్యార్థుల సమయం వృథా కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ అదనపు సమయాన్ని కేటాయించినట్లు పేర్కొంది. దీంతో అభ్యర్థులు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాసుకోవచ్చని ఎన్డీఏ ఉత్తర్వుల్లో ప్రకటించింది.






