13 June, 2026 | 1:24 AM

కాంగ్రెస్ అంటేనే స్కాంలు

13-06-2026 12:24 AM
  1. యూపీఏ హయాంలో నిత్యం ఏదో ఒక కుంభకోణం
  2. స్కాంలతో దేశానికి రూ. లక్షల కోట్ల నష్టం  
  3. నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు మోదీ
  4. అక్రమ వలసదారులను తరిమేస్తున్నాం
  5. నక్సలిజాన్ని రూపుమాపాం  
  6. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
  7. మోదీ పాలనలో చారిత్రక నిర్ణయాలు : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  8. మోదీ నాయకత్వలోనే వికసిత్ భారత్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు  

హైదరాబాద్/సికింద్రాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): కాంగ్రెస్ హయాం.. పూర్తిగా కుంభకోణాల మయమని, కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ఏదో ఒక స్కామ్ జరిగేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. బొగ్గు, 2జీ, కామన్వెల్త్ వంటి స్కామ్‌లతో దేశానికి రూ.లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ పాలన పారదర్శకంగా, సజావుగా సాగుతుందన్నారు. 

ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్ సిక్ విలేజ్‌లో శుక్రవారం నిర్వహించిన మేధావుల సదస్సులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, ఇతర బీజేపీ ముఖ్యమైన నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. నరేంద్రమోదీ గుజరాత్‌కు పలుదఫాలు సీఎంగా, 12 ఏళ్లుగా ప్రధానిగా తన జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.

మోదీ మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు తనతో ఒక విషయం స్పష్టం చేశారని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. తాను తినను, ఇతరులను తిననివ్వనని పేర్కొన్నారని గుర్తు చేశారు. నీతి, నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరతకు మోదీ మారుపేరుగా నిలిచారని కొనియాడారు. రాజకీయాల్లో ఏ నాయకుడికైనా, ఏ రాజకీయ పార్టీకైనా అతిపెద్ద ఆస్తి విశ్వసనీయతే అన్నారు. అలాంటి విశ్వసనీయత ఉన్న పార్టీ దేశంలో ఏదైనా ఉందటే అది ఒక్క బీజేపీ మాత్రమేనన్నారు.

దేశ రాజకీయాల్లో తలెత్తిన సంక్షోభాన్ని సవాలుగా స్వీకరించిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమ వలసదారులను తరిమివేస్తున్నామన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వారి నడ్డిని ఎలా విరిచారో పశ్చిమబంగాల్‌లో చూశామన్నారు. బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు.

నాలుగు లక్షణాలు తప్పనిసరి

ప్రజల విశ్వాసం చూరగొనడానికి సమగ్రత, స్పష్టమైన ఉద్దేశం, పని చేసే సామర్థ్యం, వాగ్దానాలను నెరవేర్చడం వంటి  లక్షణాలు తప్పనిసరి అవసరమన్నారు. ఈ నాలుగు లక్షణాలు ఉన్నవారే దేశానికి, ప్రపంచానికి అత్యంత సమర్థుడైన నాయకుడని, అత్యంత విశ్వసనీయులని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. మోదీ హయాంలో ప్రతి రూపాయి దేశ భద్రతను బలోపేతం చేయడానికి పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొన్నారు. తాము రాబోయే ఎన్నికల గురించే ఆలోచించడం లేదు.. రాబోయే తరం గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాం, అక్రమ వలసదారులను తరిమివేస్తున్నామని చెప్పారు.

ప్రధాని మోదీ తన తల్లి మరణం తర్వాత ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని.. దేశం గురించి, దేశ ప్రజల గురించి ఎంతగా ఆలోచిస్తారో అర్థమవుతుందన్నారు. 12 ఏళ్లలో దేశంలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. వాగ్దానాలు చేయమని, ఫలితాలు అందిస్తామన్నారు. 

నక్సలిజం నుంచి భారత్‌కు విముక్తి కలుగుతుందని ఎవ్వరూ ఊహించలేదని, తాము చేసి చూపించామని పేర్కొన్నారు. 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిందని.. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు పెద్ద పీఠ వేసిందని, 5 వందేభారత్ రైళ్లు ఇచ్చిందన్నారు. అమృత్ భారత్ రైళ్లను కూడా తెలంగాణకు మంజూరు చేశామని చెప్పారు.  అంతకుముందు బేగంపేట ఎయిర్‌పోర్టులో రాజ్‌నాథ్‌సింగ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ తదితరులు ఘనస్వాగతం పలికారు.

సెలవు తీసుకొని గొప్ప నేత మోదీ : కిషన్‌రెడ్డి

మోదీ పాలనలో అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని.. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, ఉగ్రవాద నిర్మూలనకు కఠిన చర్యలు ఇలా ఎన్నో అమలు చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డ తెలిపారు. నరేంద్రమోదీ ప్రధానిగా 12 ఏళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవలో నిమగ్నమైన గొప్ప నాయకుడని కొనియాడారు. తన తల్లి స్వర్గస్తులైన రోజు కూడా విధి నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. 

ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు తాను ప్రధానమంత్రి కాదు, ప్రధాన సేవకుడిని అని చెప్పారని, ఆ మాటలను చేతల్లో చూపించారని పేర్కొన్నారు. నీతి, నిజాయితీ, పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ, అవినీతి ఆరోపణలకు తావులేకుండా పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు.  

దేశ భద్రతలో రాజీపడని నాయకత్వం : రాంచందర్ రావు

మోదీ నాయకత్వంలోనే సురక్షిత, వికసిత భారత్ సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ వంటి సాహసోపేత చర్యలతో భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. దేశ భద్రత విషయంలో రాజీపడని నాయకత్వం, నిర్ణయాత్మక పాలన వల్లే భారత్ నేడు మరింత సురక్షిత దేశంగా నిలిచిందని ఆయన అన్నారు. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం దేశాన్ని ఆర్థిక, వ్యూహాత్మక, భద్రతా రంగాల్లో కొత్త శిఖరాలకు తీసుకెళ్లిందని, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం దూరదృష్టి నాయకత్వానికి నిదర్శనమని కొనియాడారు.

ఉగ్రవాదం సహా జాతీయ భద్రతకు ఎదురైన ప్రతి సవాల్‌కు మోదీ ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చిందని స్పష్టం చేశారు. మహిళలకు సాయుధ దళాల్లో మరిన్ని అవకాశాలు, ఉన్నత స్థానాలు లభిస్తున్నాయని, ఇది నారీ శక్తి వందన్ పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ప్రపంచ సంక్షోభాలు ఎదురైనా, భారత్ అభివృద్ధి సాధించేలా మోదీ ధైర్యంగా అడుగులు వేశారని, అందుకే నిరంతరాయంగా అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారని కొనియాడారు. ప్రజల ఆశీర్వాదంతో 2029లో మోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేవ చరిత్రలో సువర్ణాధ్యాయం: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వడం మన చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. సీఎం, పీఎంగా ఏకధాటిగా 25 ఏళ్ల పాటు నిరవధికంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఏకైక నాయకుడు మోదీ అన్నారు. మోదీ సుదీర్ఘ పాలనలో అనేక అద్భుతాలు సాధించారని తెలిపారు. అవినీతి రహిత పాలన, జాతీయ రహదారుల నిర్మాణంలో రికార్డ్ సాధించారన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్లలో కేవలం 18 వేల కి.మీ. జాతీయ రహదారులు నిర్మిస్తే.. ఈ పదేళ్లలోనే ఏకంగా 30 వేల కి.మీ. హైవేలు నిర్మించారన్నారు. ఇందులో తెలంగాణకే నేషనల్ హైవేల కోసం రూ.1,20,000 కోట్లు కేటాయించారని తెలిపారు. మోదీ పాలనలో 40 వేల కి.మీ. మేర కొత్త రైల్వే ట్రాక్‌లు నిర్మించడమే కాకుండా, రైల్వే నెట్‌వర్క్‌ను దాదాపు 100 శాతం విద్యుధీకరణ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, బీజేపీ శాసనమండలి పక్ష నాయకులు ఏవీఎన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి , మల్క కొమురయ్య, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి  చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతం రావు, వీరేందర్ గౌడ్ పాల్గొన్నారు.