ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి
ఆదాయం కోసం వినూత్నంగా ఆలోచించాలి: కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ టౌన్, జూలై 28 :ప్రతి నీటి బొట్టు ను భూమి లోకి ఒడిసి పట్టాలని, గ్రామాలకు స్థిరమైన ఆదాయం వచ్చేలా వినూత్న ఆలోచనలతో అభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్లగొండ ఎంపీపీ కార్యాలయంలో వి .బి .జి . రాం జీ జలసిరి పనులపై సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, టెక్నికల్ సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వి .బి .జి . రాం -జీ పనుల్లో భాగంగా ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, ఊట కుంటలు నిర్మించి వర్షపు నీటిని భూమి లోకి ఒడిసిపట్టాలని సూచించారు. జల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలతో చర్చించి గ్రామాలకు అవసరమైన పనులు గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
రైతులు పత్తిపైనే ఆధారపడకుండా కందులు, పెసర్లు, సజ్జలు, కొర్రలు, వంటి ఆరుతడి పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని, చెత్త వేయడం వల్ల జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్లాస్టిక్ సేకరించి అమ్మడం ద్వారా గ్రామాలకు ఆదాయం వస్తుందని తెలిపారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ గోదాములు, కోల్ స్టోరేజ్ నిర్మాణాలతో గ్రామ ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శంకర్ నాయక్, ఎంపీడీవో యాకూబ్ నాయక్, apo స్ఫూర్తి, తదితరులు పాల్గొన్నారు.






