4 May, 2026 | 3:51 AM

సంగారెడ్డిలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీ

04-05-2026 02:38 AM
  1. మంజూరు చేసిన మంత్రి వివేక్ వెంకట స్వామి
  2. రూ.8 లక్షల సొంత నిధులతో మరమ్మతులు చేయిస్తున్న జగ్గారెడ్డి
  3. త్వరలోనే ప్రారంభం

సంగారెడ్డి, మే 3(విజయక్రాంతి):సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల కార్మికులకు ఈఎస్‌ఐ డిస్పెన్సరీ మరి కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు కార్మిక శాఖా మంత్రి వివేక్ వెంకట స్వామి సంగారెడ్డి పట్టణానికి ఈఎస్‌ఐ డిస్పెన్సరీ మంజూరు చేశారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు కావాల్సిన భవనం కోసం జగ్గారెడ్డి, నిర్మల గత కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బైపాస్ రోడ్డులో ఎంపీడీవో కార్యాలయం పక్కన వినియోగంలో లేని ఆర్‌అండ్ బి క్వార్టర్ ను కేటాయించారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు అవసరమైన మరమ్మత్తుల కోసం జగ్గారెడ్డి 8 లక్షల రూపాయల తన సొంత నిధులను అందించారు.

ప్రస్తుతం మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. జరుగుతున్న పనులను జగ్గారెడ్డి పరిశీలించారు. బెడ్స్ ఏర్పాటుకు, అవసరమైన ల్యాబ్, మెడిసిన్స్ ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. పక్కా భవనం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సంగారెడ్డి పట్టణంలోనే డిస్పెన్సరీ ఏర్పాటు అవుతుండటం సంతోషకరమని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది కార్మికులకు ఈ డిస్పెన్సరీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మరమ్మత్తు పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి మంత్రులు వివేక్ వెంకట స్వామి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభం చేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ నాయకులు జార్జ్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.