2 July, 2026 | 1:18 AM

స్కాంల గని సింగరేణి

02-07-2026 12:12 AM
  1. అభివృద్ధి నిధుల పేరిట కాంగ్రెస్ మోసం
  2. బొగ్గు లేక పవర్ ప్లాంట్లు మూత!
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు 

కరీంనగర్/మంచిర్యాల, జూలై 1 (విజయక్రాంతి): 137 ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం స్కాంల గనిగా మార్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన క్యాతనపల్లి మున్సిపాలిటీలో బుధవారం ఏర్పాటు చేసిన సింగరేణి పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి పేరిట కుంభకోణాలకు పాల్పడుతున్నదంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా రు.

సింగరేణిలో ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన తీసుకొచ్చి సీఎం బావమరిది సృజన్‌రెడ్డికి అప్పగించారని ఆరోపించారు. ఎన్టీపీసీ, హెచ్‌పీసీలు సోలార్ ప్లాంట్లు పెట్టి రూ. 3 కోట్లకు ఒక మెగా వాట్ కు ఖర్చు పెడితే సింగరేణి 67 మెగావాట్‌ల సోలార్ ప్లాంటుకు ఒక మెగా వాట్‌కు రూ.7 కోట్ల వ్యయంతో టెండర్ కట్టబెట్టడంతో సుమారు 280 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి 10 శాతం మొబులైజన్ అడ్వాన్స్ ఇచ్చి కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు.

అదే 107 మెగా వాట్‌ల సోలార్ ప్లాంటుకు మెగా వాట్‌కు రూ. 5.40 కోట్ల టెండర్ ఇయ్యడం తో 214 కోట్లు అదనంగా కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీఆర్, పీపీఏ లేకుండానే జైపూర్ పవర్ ప్లాంట్ (800 మెగావాట్ల)కు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి రెండేండ్ల కింద ప్రారంభించారని, ప్రస్తుతం అది ఆగిపోవడం తో రోజుకు రూ.2 కోట్లు నష్టం జరుగుతుందన్నారు. బొగ్గు ఉత్పత్తి చేయకుండా బొగ్గు తవ్వినట్లు, ఉత్పత్తి చేసినట్లు, లాభాలు వచ్చినట్లు ఐటీ కట్టి దండుకున్నారని ఆరోపించారు.

జెన్కో పాయింట్లలో మినిమం 25 లక్షల టన్నుల బొగ్గు ఉండాల్సి ఉండగా బొగ్గు కొరత ఉందని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు హెచ్చరించిందని ప్రశ్నించారు. బొగ్గు లేకపోవడంతో కొత్తగూడెంలో కరెంటు ఉత్పత్తి ఆగిందని, యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో 800 మెగా వాట్ల ప్లాంటులో ఉత్పత్తి, భద్రాద్రి థర్మల్ ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం ఎక్స్ ప్లోజివ్స్ ధర పెంచాలని సింగరేణి డైరెక్టర్లను ఒత్తిడి చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ పాలనలో 7,355 కోట్లు ప్రభుత్వానికి బకాయి ఉండగా, కాంగ్రెస్ రెం డేండ్ల పాలనలో సింగరేణికి 12,370 కోట్లు బకాయి పడ్డదన్నారు. 2023 లాభాల్లో సింగరేణి అభివృద్ధి, భవిష్యత్తు అవసరాల కోసం రూ.2,283 కోట్లు పక్కకు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 సైతం రూ.4,034 కోట్లు బ్యాంకులో పెడుతున్నామని, సుమారు రూ.6,300 కోట్లు (ఎఫ్డీలు) పక్కకు పెడితే సింగరేణి రూ.4,300 కోట్లు అప్పు ఎలా ఉం దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రశ్నించారు.

సింగరేణి స్కాంలపై సీబీసీఐడీ విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్,  ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యేల నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ, కోనేరు కోనప్ప, పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు.

మేడిగడ్డ నీటిని ఎందుకు ఆపారు?

మేడిగడ్డ నీటిని తరలించకుండా ఎందుకు ఆపారని హరీశ్‌రావు సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మేడిగడ్డ నుండి నీటిని తరలించే అవకాశం ఉన్నా, రేవంత్ ప్రభుత్వం బురద రాజకీయాల కోసం నీటిని నిలిపివేసిందన్నారు. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి జరిగే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బిఎల్‌ఏలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఓట్లు గల్లంతు కాకుండా క్షేత్రస్థాయిలో నిఘా వేయాలని అన్నారు.