ఒకటో తేదీనే జీతాలు
ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి గుడ్ న్యూస్
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల చెల్లింపు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ బుధవారం ఉద్యోగుల జీతాలను విడుదల చేసింది.
జీతాల చెల్లింపులో ఆలస్యం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన సీఎం రేవంత్రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, హానరేరియం ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి కూడా ప్రతి నెలా జీతాలు ఆలస్యం లేకుండా అందించాలని ఇటీవలే అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల అమలులో భాగంగా ఆర్థిక శాఖ ఇటీవల అన్ని శాఖలు, విభాగాలకు సర్క్యులర్ జారీ చేసింది.






