2 July, 2026 | 1:31 AM

రామప్పకు ముప్పు

02-07-2026 12:33 AM
  1. శిల్ప వైభవానికి బ్లాస్టింగ్ బెడద
  2. కాకతీయుల కళాఖండంపై ఓపెన్ కాస్ట్ ముప్పు
  3. పేలుళ్లతో కదలనున్న ఆలయ పునాదులు
  4. అడవులు జీవవైవిధ్యానికీ తప్పని నష్టం

వెంకటాపూర్, జూలై 1 (విజయక్రాంతి): ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నేడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల తవ్వకాలు, బ్లాస్టింగుల ప్రభావం వల్ల ఈ చారిత్రక కట్టడానికి ముప్పు ఏర్పడుతుందనే ఆందోళనలు స్థానిక ప్రజలు, రైతులు, పర్యావరణ ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు.

చరిత్ర, సంస్కృతి, పర్యావరణం, వ్యవసాయం, ప్రజల జీవనోపాధి ఈ ఐదు అంశాలు ఒకేసారి ప్రభావితమయ్యే పరిస్థితి నెలకొంటోందనే వాదనలు వినిపిస్తున్నాయి. రామప్ప దేవాలయం కాకతీయుల అపూర్వ శిల్పకళకు, ఇంజినీరింగ్ నైపుణ్యానికి, కళాత్మక దృష్టికి ప్రతీక. సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం తన శిల్ప సౌందర్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

ఆలయంలోని శిల్పాలు, స్తంభాలు, నిర్మాణ శైలి నేటికీ పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల కృషి, శాస్త్రీయ అధ్యయనాలు, చారిత్రక ఆధారాల పరిశీలన తర్వాత యునెస్కో ఈ గుర్తింపును ఇచ్చింది. ఈ గుర్తింపుతో తెలంగాణ పేరు ప్రపంచ పటంలో మరింత ప్రాచుర్యం పొందింది. విదేశీ పర్యాటకులు సైతం రామప్పను సందర్శిస్తూ కాకతీయుల వైభవాన్ని ప్రశంసిస్తున్నారు. 

ఓపెన్ కాస్ట్ తవ్వకాలపై ఆందోళనలు

రామప్ప నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు తవ్వకాలు వద్దని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది. కానీ క్వారీ నుంచి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలోనే ఆలయం ఉంది. అనుమతుల కోసం ఐదున్నర కిలోమీటర్లుగా అధికారులు చూపిస్తున్నారని, పీవీ పేరు పెట్టి చారిత్రక విధ్వంసానికి సింగరేణి రెడీ అవుతుందని పలువురు విమర్శిస్తున్నారు. గణపురం మండ లం మాధవరావుపల్లి సమీపంలో జరుగుతు న్న బొగ్గు గనుల బ్లాస్టింగుల కారణంగా భూమి లో ప్రకంపనలు ఏర్పడుతున్నాయి.

ఈ ప్రకంపనల వల్ల సమీప గ్రామాల్లోని ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని గ్రామస్థులు చెపుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రామప్ప దేవాలయం నిర్మాణంపైనా ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే రామప్ప సరస్సు నీటిమట్టంపై కూడా గనుల ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. నీటిమట్టం తగ్గితే సుమారు 50 వేల ఎకరాల వ్యవసాయం దెబ్బతినే అవకాశం ఉంది. 

అడవులు, జీవవైవిధ్యానికి ముప్పు

వెంకటాపూర్ మండల పరిసర ప్రాంతాలు పచ్చని అడవులకు ప్రసిద్ధి. ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణ వల్ల అడవులు నాశనమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గీత కార్మికులు, రైతులు, అటవీ ఉత్పత్తులపై ఆధారపడే కుటుంబాలు అధికంగా ఉన్నాయి. గనుల విస్తరణ వల్ల వందలాది కుటుంబాల జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉంది.