సాహో.. విజయ్
- సూపర్‌స్టార్ నుంచి సీఎంగా ‘దళపతి’
- తమిళనాడులో సంస్కరణల పర్వం
- రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న టీవీకే
- కఠిన నిర్ణయాలు, దూకుడుగా ఫైళ్ల క్లియరెన్స్
- పారదర్శకత, అవినీతిరహిత పాలనకు ప్రాధాన్యం
చెన్నై, జూలై 1: తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ తనదైన దూకుడు, పారదర్శక పాలనతో కొత్త శకానికి నాంది పలికారు. ఆరు దశాబ్దాల ద్రావిడ పార్టీల ఏకఛత్రాధిపత్యానికి బ్రేక్ వేసి, కోటలను బద్దలు కొట్టిన సరికొత్త నాయకుడు ’దళపతి’ విజయ్.. వెండితెరపైనే కాదు, వాస్తవ రాజకీయాల్లోనూ సరికొత్త ట్రెండ్ సృషిస్తున్నారు. అవినీతి రహిత, సంక్షేమం, మహిళా రక్షణ, పారదర్శకతే లక్ష్యంగా పాలనపై తనదైన మార్క్ వేస్తున్నారు.
తన పాలనా శైలితో ప్రత్యర్థుల నోళ్లు మూయిస్తున్నారు. రెండేళ్ల క్రితం 2024 ఫిబ్రవరి 2న విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించారు. ద్రావిడ పార్టీల ఆధిపత్యాన్ని ఆయన సవాల్ చేశారు. 2026 మే 4న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో విజయ్ సంచలనం సృష్టించారు. ఆరు దశాబ్దాల ద్రావిడ పార్టీల పాలనకు ముగింపు పలికారు. మే 10న విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తొలి రోజే సంచలన నిర్ణయాలు
విజయ్ ముఖ్యమంత్రి కాగానే హామీల అమలుపై దృష్టి సారించారు. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై సంతకం చేశారు. దీనివల్ల 2.4 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. జిల్లాల్లో డ్రగ్స్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. దీనిని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తు న్నారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం ’సింగప్పెణ్’ (సింహిణి) ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను తీసుకొచ్చారు.
అధికారం చేపట్టిన 48 గంటల్లోనే విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు దగ్గరగా ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాల ను మూసివేయించారు. 500 మీటర్ల పరిధిలో ని వైన్ షాపులను తొలగించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. తమిళనాడులోని ప్రభుత్వ రవాణా బస్సులన్నింటినీ ఏసీ బస్సు లుగా మారుస్తామని తాజాగా ప్రకటించారు.
కార్పొరేట్ శైలి.. క్రమశిక్షణ
విజయ్ పనితీరు సచివాలయంలో ప్రత్యే కంగా నిలుస్తోంది. సంప్రదాయ తెల్లని వేష్టికి బదులు ఆయన సూట్ ధరిస్తున్నారు. ఒక ఆధునిక పాలకుడిగా కనిపిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం సమయానికి కార్యాలయానికి వస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు డెస్క్ వద్దే ఏడు గంటలు గడుపుతున్నారు. అధికారుల్లో క్రమశిక్షణ పెంచారు. సొంత ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. రాజకీయ సమావేశాల కంటే ఫైళ్ల క్లియరెన్స్కే ప్రాధాన్యం ఇస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వంతో విజయ్ వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమిళనాడు సమస్యలను వివరించారు. మేకేదాటు ఆనకట్ట, శ్రీలంకలో తమిళ జాలర్ల అరెస్ట్ వంటి అంశా లను ప్రస్తావించారు. నీతి ఆయోగ్ సమావే శంలో పాల్గొన్నారు. 2035 నాటికి తమిళనాడు ఆర్థిక వ్యవస్థను 1.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే ఆయన లక్ష్యాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లాహిరి ప్రశంసించారు.
ఆలయాల నిధులు సద్వినియోగం
అవినీతిపై విజయ్ కఠినంగా వ్యవహరిస్తు న్నారు. గత డీఎంకే ప్రభుత్వం కేటాయించిన రూ.245.85 కోట్ల హిందూ మతపరమైన దేవాదాయ శాఖ ప్రాజెక్టులను రద్దు చేశారు. గుడుల నిధులను వాణిజ్య అవసరాలకు కాకుండా ఆలయాల కోసమే ఖర్చు చేయాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యాల కోసం కొత్త పథకాలు తెస్తామన్నారు. అమ్మ క్యాంటీన్లను ఆధునీకరించారు. సహకార బ్యాంకు రుణాల మాఫీ ప్రక్రియను ప్రారంభించారు. పారదర్శక పాలనను అందిస్తూ దూసుకుపోతున్నారు.
కూల్చే కుట్ర!
మాజీ సీఎం స్టాలిన్, మాజీమంత్రి సెంథిల్‌పై ఆరోపణలు
చెన్నై, జూలై 1 (విజయక్రాంతి): టీవీకే (సీఎం విజయ్) ప్రభుత్వాన్ని కూల్చేందు కు కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని ఆరోపించారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతుండగా, ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
పార్టీకి చెందిన ఎన్ ఇళయరాజా చెన్నై పోలీసులను ఆశ్రయించి ఐపీడీఎస్ కన్సల్టెన్సీ ఉద్యోగిపై ఫిర్యాదు చేశారు. తమిళ నాడు అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని, అందుకు రూ.35 కోట్లు ఇస్తానని చెప్పాడన్నారు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దని కూడా అన్నాడని పేర్కొన్నా రు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఉద్యోగిని అరెస్ట్ చేశారు.
ఆ ఉద్యోగి సెంథిల్ బాలాజీకి సన్నిహితుడని సమాచారం. మంత్రి నిర్మల్‌కుమార్ మాట్లాడుతూ.. సెంథిల్ ఈ వ్యవహారంలో నేరుగా పాలుపంచుకున్నారని, ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కుట్రలో భాగమైన ప్రతీఒక్కరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కుట్రలో ఎంకె స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్‌ల పాత్ర ఉందని ఆరోపించారు. కాగా ఈ విషయంపై సీఎం విజయ్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.






