ఆయోధ్య దొంగతనంపై నోరు విప్పరా?
బీజేపీని నిలదీసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): అయోధ్య రామ మందిరంలో జరిగిన దొంగతనంపై ప్రధాని నరేంద్రమోదీతో పాటు బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా వహిస్తు న్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిలదీశారు. భక్తులు హుండీలో వేసిన డబ్బులు దోచుకోవడం సిగ్గుచేటన్నారు. ఇన్నేళ్లు రాముడి పేరును రాజకీయం కోసం వాడుకుని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
శ్రీరాముడిని ఓటు బ్యాంక్ గానే చూస్తారా? రాముడి గుడిలో దొంగతనం జరిగితే పట్టించుకోరా? అయోధ్య ట్రస్ట్ మోదీ, అమిత్ షా, యోగి పరిధిలోనే ఉన్నా నోరెందుకు విప్పడం లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ దొంగతనంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుకు చిన్నవిషయంగా కనిపిస్తుందా? అని జగ్గారెడ్డి మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో లేకుంటే.. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ రాద్ధాంతం చేసేవాళ్లన్నారు. కాంగ్రెస్ పార్టీ మతాలను, కులాలను కలుపుతుందని, బీజేపీ కులాలు, మతాలను విడదీస్తుందన్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు ఏమి పనిలేకనే సీఎం రేవంత్ రెడ్డిపైన విమర్శలు చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. కేటీఆర్‌కు ఏమీ పనిలేదని విమర్శించారు.






