26 August, 2026 | 3:40 AM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

26-08-2026 12:03 AM
  1. జిల్లా కలెక్టర్ రాజర్షిషా
  2. మొక్కలతోనే స్వచ్ఛమైన వాతావరణం
  3. ఎస్పీ అఖిల్ మహాజన్

నేరడిగొండ, ఆగస్టు 25 : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. మంగళవారం ’వన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా నేరడిగొండ మండలం వాగ్ధారి గ్రామ సమీపంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన మొక్కలను నాటి నీరు పోసి పచ్చదనం ప్రాముఖ్యతను చాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ’వికసిత్ భారత్ -2047’ లక్ష్య సాధన ధ్యేయంగా మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం పచ్చని భవిష్యత్తును నిర్మిద్దాం అని పిలుపునిస్తూ, ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పెంపకం ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు.

వన మహోత్సవం కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు ప్రజలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి అధికారి విశ్వనాథ్ బుస రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.