5 June, 2026 | 4:44 PM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

05-06-2026 03:31 PM

 మచ్చుపేట ఉప సర్పంచ్ దొంతుల రాకేష్

ముత్తారం జూన్05(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మచ్చుపేట గ్రామంలో పర్యావరణ స్పృహ చాటేలా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్క) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప సర్పంచ్ దొంతుల రాకేష్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో మొక్కల పాత్ర కీలకమని అన్నారు. కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చెట్లే ప్రాణాధారమని, భవిష్యత్ తరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడం మనందరి కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యురాలు దుండె జ్యోతి రాణి, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, గ్రామ కార్యదర్శి లక్ష్మణ్ బాబు, సీఏ కోమలత, అంగన్‌వాడీ టీచర్ కళావతి, గ్రామ సిబ్బంది, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు.