10 March, 2026 | 12:44 AM

వార్డు సభ్యుల శిక్షణ ముగింపు

08-03-2026 04:05 PM

సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు

చివ్వెంల,(విజయక్రాంతి): గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్ పేర్కొన్నారు. చివ్వెంల మండలంలోని మొదటి బ్యాచ్‌కు చెందిన 10 గ్రామాల నూతన వార్డు సభ్యులకు తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం–2018పై ఐదు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణ పూర్తిచేసుకున్న వార్డు సభ్యులకు అధికారులు సర్టిఫికెట్లు అందజేశారు. 

ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ పంచాయితీ రాజ్ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉంటేనే గ్రామాల్లో పారదర్శకమైన పాలన సాధ్యమవుతుందని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామ స్థాయిలో అమలు చేసి ప్రజల సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాల్గొనాలని వార్డు సభ్యులకు సూచించారు.

ఎంపీవో మాట్లాడుతూ వార్డు సభ్యులు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకొని ప్రజలకు చేరువగా ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ శిక్షణా కార్యక్రమంలో టీఓటీ శిక్షకులు ఎం. అరవింద్ నారాయణ, సలీం, సుధాకర్, సతీష్ వార్డు సభ్యులకు పంచాయితీ రాజ్ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించి మార్గనిర్దేశం చేశారు.

కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ నాయుడు, టైపిస్ట్ మల్లేశ్, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అధికారులు ఈ శిక్షణతో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.