స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు, ఆగస్టు 3 (విజయ క్రాంతి) : స్వాతంత్రదినోత్సవ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు లతో కలసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని తాగేడు మైదానం లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు స్టేజి ఏర్పాట్లు, ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
జాతీయ పతాకావిష్కరణ సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం పనితీరును ముందస్తుగా పరిశీలించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు స్టాల్ లు ఏర్పాటు చేయాలని, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసే ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వ సిబ్బందికి అవసరమైన త్రాగునీటి సౌకర్యం, ఇతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ తెలిపారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని, అలాగే ప్రభుత్వ శాఖల అధికారులు తమ కార్యాలయ సిబ్బంది అందరితో కలిసి తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, ఎస్డిసి ప్రతాప్, కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






