29 July, 2026 | 2:34 AM

16మంది మావోయిస్టుల లొంగుబాటు

29-07-2026 01:35 AM
  1. భారీ విజయమన్న జార్ఖండ్ డీజీపీ తదాషా మిశ్రా
  2. లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళలు

రాంచీ, జూలై 28: జార్ఖండ్ పోలీసుల ముందు 16 మంది మావోయిస్టులు మంగళవారం లొంగిపోయారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఆరుగురిపై రూ.39 లక్షల రివార్డు కూడా ఉంది. వీరు లొంగిపోవడం రాష్ట్ర పోలీసులకు పెద్ద విజయమని జార్ఖండ్ డీజీపీ తదాషా మిశ్రా అభివర్ణించారు. డీజీపీ ఆదేశాల మేరకు సీఆర్పీఎఫ్, జార్ఖండ్ పోలీసులు, జాగ్వార్స్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ నవజీవన్ కింద వీరంతా లొంగిపోయారని వివరించారు.

ఆరు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు ఏకే 47 రైఫిళ్లు, ఒక హెచ్‌కే -33 రైఫిల్, ఒక యూఎస్ క్బాన్ రైఫిల్, ఒక ఎం 16 రైఫిల్, 38 మ్యాగజైన్లు, 1,562 కాట్రిడ్జను అప్పగించారని డీజీపీ తెలిపారు. రాష్ట్రం నుంచి తీవ్రవాదం, నేరాలను పూర్తిగా నిర్మూలించడానికి పోలీసులు కట్టుబడి ఉన్నారని అన్నారు. 2026లో 96 మందిని అరెస్టు చేశామని, 45 మంది లొంగిపోయారని, 22 మంది ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని చెప్పారు.

లొంగిపోయిన 16 మందిలో 128 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న సంతోష్ మహతో రీజినల్ గ్రూప్ సభ్యుడు, జోనల్ కమిటీ సభ్యుడు చందన్ లోహ్రా (78కేసులు) రూ. 10 లక్షల రివార్డు, సబ్ జోనల్ కమిటీ సభ్యులు అనిల్ తురి (5 లక్షల రివార్డు), ఏరియా కమిటీ సభ్యుడు సుదేష్ హోన్హా, రిసివ్ (ఒక్కొకకరిపై రూ. 2 లక్షల బహుమతి) సహా పలువురు ఉన్నారు.